హైదరాబాద్ శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండాలో బెంగళూరు జాతీయ రహదారి పక్కన సర్వే నం.220లో 110.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 60 ఎకరాలను మాజీ సైనికాధికారులకు కేటాయించగా మిగిలిన 50 ఎకరాలను స్థానిక రైతులకు ప్రభుత్వం అసైన్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు రైతులు విక్రయించుకోవడంతో 16 ఏళ్ల క్రితం 32 ఎకరాలను పీవోటీ కింద ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందులోంచి 2006లో 6.2 ఎకరాలను ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించారు. కొంత భాగం ఇళ్లు నిర్మించుకోగా మిగతాది ఖాళీగా ఉంది. మరో 19 ఎకరాల్లో స్థానిక ఎస్సీ, ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నారు. ఎకరా స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ఇంకా ఆరు ఎకరాలు ఖాళీగా ఉంది.
కుటుంబసభ్యుల పేరిట పత్రాల తయారీ
ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన భూమితోపాటు మిగిలిన పడావుగా ఉన్న భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. పెద్దషాపూర్ మాజీ సర్పంచి భూదందాకు తెరలేపాడు. తన భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు పేరిట భూములకు హక్కు ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చే అధికారం తనకు లేకున్నా ఉన్నట్లుగా నకిలీ పత్రాలతో నమ్మబలికి .. తర్వాత కాగితాలపై ప్లాటు ఉన్నట్లుగా చూపించి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేవాడు. ప్లాటు విస్తీర్ణం బట్టి రూ.1.20లక్షల నుంచి రూ.2.40లక్షల ధర ఉండేది. అతని పదవీకాలం 9 ఏళ్ల క్రితమే ముగిసినా ఇప్పటికీ భూమి కేటాయిస్తున్నట్లుగా పత్రాలు సృష్టించి, ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నాడు. సుమారు 300 మందికి బురిడీ కొట్టించాడు. జాతీయరహదారి పక్కన తక్కువ ధరకే వస్తుందన్న ఆశతో కొందరు కొనుగోలు చేసి మోసపోతున్నారు. మాజీ సర్పంచి అక్రమాలకు బిల్‌కలెక్టర్ సహకరిస్తున్నాడు. నకిలీ పత్రాలపై పేర్లు రాయడం, స్టాంపులు వేయడంలో అతనే కీలకమని తెలుస్తోంది.
నిషేధిత జాబితాలో భూములు
సర్వే నం.220లోని భూములు నిషేధిత జాబితా(22ఎ)లో ఉన్నాయి. వీటి క్రయవిక్రయాలు చట్టవిరుద్ధం. రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోవడంతో సదరు మాజీ సర్పంచి నోటరీలు చేసి విక్రయించే వ్యవహారానికి తెరలేపాడు. కొనుగోలు చేసిన వ్యక్తులు వచ్చి చూపించాలని అడిగితే ప్రభుత్వ భూమిలో రాళ్లు పాతి ప్లాట్లు చేసినట్లుగా చూపిస్తున్నాడు. అటు రెవెన్యూ అధికారులు అక్కడ ప్రభుత్వ భూమిగా సూచిస్తూ బోర్డుల ఏర్పాటుతో సరిపెట్టుకున్నారు.
రెండు, మూడు రోజుల్లో సర్వే చేయిస్తాం
సర్వే నం.220లో నోటరీలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మాజీ సర్పంచిపై ఇప్పటికే క్రిమినల్ కేసు పెట్టాం. రెండు, మూడు రోజుల్లో భూమిని సర్వే చేయిస్తాం. ఇప్పటికే అక్కడ బోర్డులు ఏర్పాటుచేశాం. ఎవరైనా వాటిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. ఇక్కడెవరూ కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తాం.- జనార్దనరావు, తహసీల్దారు, శంషాబాద్
ఇదీ చదవండిః ఇసుక తీసేందుకు వెళ్లి మంజీరాలో చిక్కుకున్న ఆరుగురు