పిల్లలు తప్పు చేస్తే... తల్లిదండ్రులు మందలించడం సహజమే. తన కూతురు చెడు సావాసాలతో తిరుగుతుంటే అడ్డు చెప్పిందా తల్లి. అదే ఆ తల్లి చేసిన తప్పైంది.
అసలేం జరిగిందంటే...?
యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి మునగనూరులో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ వృత్తి రీత్యా లారీ డ్రైవర్. కూతురు కీర్తి ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తల్లి రజిత(38) గ్రహించింది. కులం కాని వాడితో కలిసి తప్పు చేస్తున్నావని కూతురిని మందలించింది.
ప్రియుడితో కలిసి..
ప్రియుడి మోజులో పడి తానేం చేస్తోందనే ఇంగితం మరచిందా పంతొమ్మిదేళ్ల యువతి. కన్న తల్లినే చంపడానికి పథకం వేసింది. తండ్రి లేని సమయంలో ప్రియుడు శశి అలియాస్ చంటిని ఇంటికి పిలిపించింది. ప్రియుడు తల్లి కాళ్లు పట్టుకోగా... కూతురే చున్నీ తల్లి మెడకు బిగించి చంపేసింది. ఆ తల్లి మృతదేహాన్ని మూడురోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. మృతదేహాం నుంచి దుర్వాసన వస్తోందని... ప్రియుడి సహాయంతో యాదాద్రి జిల్లా రామన్నపేట సమీపంలో రైలు పట్టాల మీద పడేసింది.
లారీ డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే కీర్తి తండ్రి 19వ తేదీన విధులకు వెళ్లాడు. అదే రోజు ప్రియునితో కలిసి తల్లిని అంతం చేసింది. 22వ తేదీ వరకు ఇంట్లోనే శవంతో సావాసం చేసింది. 22న కారులో శవాన్ని తీసుకెళ్లి రామన్న పేట వద్ద రైల్వే ట్రాక్ పై పడేశారు. ఇంటిని శుభ్రంగా కడిగేశారు.
24వ తేదీన శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఫోన్ చేస్తే భార్య నుంచి స్పందన లేదు. కూతురు వైజాగ్ వెళ్లానని నమ్మబలికింది.
ఆదివారం దీపావళి పండుగ రోజున మధ్యాహ్నం 12గంటలకు... బంధువులంతా ఒత్తిడి తీసుకొచ్చారు. నిజం చెప్పేసింది. తల్లిని అంతం చేసింది తానేనని అంగీకరించింది.
కథలో ట్విస్ట్...
నిందితురాలికి అంతకు ముందే బాల్ రెడ్డి అనే మరో వ్యక్తితో ప్రేమాయణం ఉండేది. అతని మూలంగా గర్భవతైన కీర్తికి గర్భస్రావం కూడా జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అదే సమయంలో అతని స్నేహితుడు శశి నిందితురాలు కీర్తికి దగ్గరయ్యాడు. ఇదంతా గమనించిన తల్లి కూతుర్ని మందలించింది. అదే ఆమె పాలిట శాపమైంది. యమ పాశమైంది.
తండ్రిపైనే ఫిర్యాదు..
తండ్రికి వైజాగ్ టూర్ వెళ్లానని ఫోన్లో చెప్పింది. కానీ మరొకరి ఇంట్లో తలదాచుకుంది. తీరా కుటుంబ సభ్యులంతా ఒత్తిడి తెచ్చాక... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. కీర్తి తన తండ్రిపైనే ఫిర్యాదు చేసింది. రోజు తన తండ్రి తాగి వచ్చి తల్లిని చిత్రహింసలు పెట్టేవాడని... అందుకే ఉరేసుకుని చనిపోయిందని పోలీసులకు తెలిపింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. చివరకు నిజం చెప్పింది. తల్లిని తానే చంపినట్లు ఒప్పుకుంది.