చర్లపల్లి కారాగారంలో ‘దిశ’ కేసు నిందితులను జైలు అధికారుల నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారి మానసిక పరిస్థితిని బేరీజు వేయడానికి వైద్యుల సహాయం తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిపై గంటగంటకు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. మహానది బ్యారక్‌లో నాలుగు సింగిల్ సెల్‌లలో నిందితులను ఉంచారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చర్యలు చేపట్టారు. ఇతర ఖైదీలెవరూ ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేసిన సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులూ వారిని పర్యవేక్షిస్తున్నారు.
కస్టడీకి కోరిన పోలీసులు
జైల్లో ఉన్న నిందితులను విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ షాద్‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంప్రసాద్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి సోమవారం జైలును సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. ప్రహరీని క్షుణ్నంగా పరిశీలించారు.
144 సెక్షన్
జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిందితులపై ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారంటూ ఆందోళనకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలిపే స్వేచ్ఛ, స్వతంత్రత తమకు లేదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరసనల నేపథ్యంలో అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయవచ్చని లేదా రాత్రికి రాత్రే నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
వీడియోపై ఆరా..
చర్లపల్లి జైలు నుంచి నిందితుల వీడియో బయటకు రావడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు సెల్‌ఫోన్‌ను లోపలికి ఎలా అనుమతించారో తెలియాల్సి ఉంది. ఓ కానిస్టేబుల్ వీడియో రికార్డింగ్ చేస్తుంటే మిగిలిన సిబ్బంది ఫొటోలు సేకరించినట్లు తెలిసింది. అయితే వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
ఇదీ చూడండి: 'పూటుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు'