తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడ తెరాస ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదని భాజపా నేతలు కోర్టును ఆశ్రయించారు. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కేంద్ర హోంశాఖే తేలుస్తుంది
సుప్రీంకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఇదే అభిప్రాయం వెల్లడించింది. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించింది. పిటిషనర్‌తో పాటు, చెన్నమనేని రమేశ్ నుంచి కూడా వివరాలు సేకరించిన భారత పౌరసత్వ విభాగం ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అధికారాలు పొందేందుకు అర్హుడు కాదు
చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని హోంశాఖ స్పష్టం చేసింది. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, రమేశ్ ఈ దేశంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అమెరికా నుంచి గతంలో ఆయన వీసా పొందే సమయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు అమెరికా వెళ్లకుండా వీసాను పునరుద్ధరించుకోకుండా వ్యవహరించారని తెలిపింది. తప్పుడు సమాచారంతో భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టుకు వెళ్తా: చెన్నమనేని
పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టుకు వెళ్తనని చెన్నమనేని రమేశ్ తెలిపారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న గట్టి నమ్మకం ఉందని పేర్కొన్నారు. పౌరసత్వ రద్దును కొట్టివేస్తూ ఈ ఏడాది జులై 15న హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. హైకోర్టు తీర్పును హోంశాఖ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు.