వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. త్వరలోనే సిరిసిల్ల-వేములవాడ కలిసిపోతాయన్నారు. గోదావరి నీళ్లతో ఈ రెండు పట్టణాల బీడు భూములకు నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
2లక్షల ఎకరాలకు సాగు నీరు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పనిచేసే పార్టీలకే ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
వేములవాడను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
రాబోయే నాలుగైదు ఏళ్లలో వేములవాడను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పని చేయకపోతే వారి పదవులను తొలగిస్తామన్నారు. 75 గజాల లోపు స్థలం ఉంటే పురపాలిక అనుమతి లేకుండానే ఇళ్లు కట్టుకోవచ్చన్నారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్