ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గత నెలలో బంగారు, వెండి కానుకలు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా హుండీల్లో లభించిన విలువైన వస్తువులను దాచుకుంది ఒకరైతే... దాన్ని కాజేసింది మరొకరు. కరీంనగర్‌లో వీటిని విక్రయిస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు దొంగ.
పోలీసుల కథనం ప్రకారం గతనెల 23న ఆలయ ఓపెన్ స్లాబ్‌లో హుండీల లెక్కింపు చేపట్టారు. ఇందులో ఆలయ ఉద్యోగి, పలు సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కానుకలు లెక్కిస్తున్న క్రమంలో అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంగారు, వెండి వంటి విలువైన కానుకలను ఓ సంచిలో దాచి వాటిని రహస్యంగా కార్పెట్ల కింద దాచాడు.
దొంగిలించిదొకరు.. కాజేసింది మరొకరు...
కరీంనగర్‌కు చెందిన ఫిరోజ్ ఆలయంలో బియ్యం, ఇతర వస్తువులు పోగు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గత నెల 25న ఆయన సేకరించిన బియ్యం తీసుకెళ్లేందుకు సంచి కోసం వెతుకుతున్న క్రమంలో ఓపెన్ స్లాబ్‌లోని ఓ మూలన ఈ సంచి లభ్యమైంది. వీటిని కరీంనగర్‌కు తీసుకెళ్లిన ఫిరోజ్ పలు దుకాణాల్లో విక్రయిస్తున్న క్రమంలో.. వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిరోజ్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు కానుకల సంచి కనిపించింది. కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్పందించని ఆలయ అధికారులు...
పోలీసులు ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ సిబ్బందిని ఘటనకు సంబంధించి ప్రశ్నించారు. లెక్కింపు చేపట్టిన ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీ వివరాలు కోరారు. విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈవో కృష్ణవేణి సహా ఆలయ అధికారులు ఇప్పటివరకు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అసలు దొంగతనం జరిగిన విషయమే ఆలయ సిబ్బందికి ఎవరికీ తెలియదట. పోలీసులు చివరికి ఏం తేలుస్తారోనని రాజన్న భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా లెక్కింపు సందర్భంగా ఇంటి దొంగలకు అవకాశం ఇవ్వకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'వ్యక్తిగత గోప్యత సురక్షితంగా ఉంచాలి'