పెద్దపల్లి మండలంలో కాసులపల్లి గ్రామం... స్వచ్ఛత, జల సంరక్షణ, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత విషయంలో పరిపూర్ణత ప్రదర్శిస్తోంది. ఈ గ్రామంలో 2 వేల 462 మంది జనాభా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలులో, పంచ సూత్రాల అమలు విషయంలో ముందంజలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో అంతర్గత రహదారులన్నీ సీసీ రహదారులుగా మార్పు చెందాయి. ఎక్కడ బహిరంగ మురికి కాలువలు ఉండవు. గ్రామంలో మట్టి రహదారులు మచ్చుకైనా కనిపించవు. వంద శాతం ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, కంపోస్ట్ ఫీట్స్, కిచెన్ గార్డెన్లు ఉన్న ఏకైక గ్రామంగా ప్రసిద్ధి చెందడంతో జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన ఈ గ్రామాన్ని గవర్నర్ సందర్శన కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు.
ఎమ్మెల్యే స్వగ్రామం
కాసులపల్లి గ్రామం పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వగ్రామం కావడంతో ఆయన దగ్గరుండి అన్ని రకాల అభివృద్ధి పనులు, గ్రామ శుభ్రతను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ గ్రామం శుభ్రతలో ఆదర్శంగా నిలుస్తోంది. బుధవారం గవర్నర్ పర్యటన సందర్భంగా తమకు ఎంతో సంతోషం కలుగుతోందని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.
గ్రామస్థులంతా కలిసి పనిచేయడం వల్లే..
ఒక్కరిగా చేయలేని పనిని గ్రామస్థులంతా కలిసి చేయడం వల్ల తమ గ్రామం స్వచ్ఛతలో దూసుకుపోతుందని ప్రజలు చెబుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం విషయంలో ప్రజల్లో స్వచ్ఛందంగా చైతన్యం వచ్చిందని ఫలితంగా స్వచ్ఛత సాధ్యమైందని ప్రజలు పేర్కొంటున్నారు.
బైట్: దాసరి శ్రీనివాస్, గ్రామస్తుడు
స్వచ్ఛత పనితీరును వివరిస్తాం..
శుభ్రంగా ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యాలకు తమ గ్రామంలో తావు లేదని మరికొందరు పేర్కొంటున్నారు. తమ గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే సహకారం వల్లే స్వచ్ఛ గ్రామంగా కాసులపల్లి ఏర్పడిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం గ్రామంలో పర్యటించే గవర్నర్కు స్వచ్ఛత పని తీరును వివరిస్తామని ప్రజలు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు మకుటాయమానం'