మనుషులకు, పుశువులకు వైద్యులు వైద్యం చేయడం చూశాం. కానీ నిజామాబాద్లో మాత్రం మొక్కలకు వైద్యం చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా.. అక్షరాలా నిజం. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో నాటిన మొక్కలను సెలైన్ సీసాల సాయంతో నీరందించి రక్షించారు. ఆస్పత్రి అవసరాలకే నీళ్లు సరిపోని పరిస్థితిలో మొక్కలకు నీరు సరఫరా చేసి బతికించారు.
తాగడానికే నీరు లేని పరిస్థితుల్లో
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 2017 ఏప్రిల్లో మొక్కలు నాటారు. అప్పుడు ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల తాగు నీటికి సైతం కొరత ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో మొక్కలకు నీరందించడం కష్టతరంగా మారింది.
సెలైన్ సీసాలతో నీరందించారు
ఆ సమయంలోనే వైద్యులకు వచ్చిన ఓ ఆలోచన ఆస్పత్రి ఆవరణనే మార్చేసింది. తక్కువ నీటితో మొక్కలను బతికించుకోవడానికి... వాడిన సెలైన్ సీసాలను పాదులు తీసి కర్రకలకు కట్టారు. ఆ సీసా నుంచి ఒక్కో నీటిబొట్టు మొక్క మొదట్లో పడేలా చేశారు. ఇలా రెండేళ్ల పాటు మొక్కలకు నీరందించగా. అవి ఇప్పుడు ఏపుగా పెరిగాయి.
సంజీవని...
నీటి ఎద్దడితో ఎండిపోయే స్థితిలో ఉన్న మొక్కల పాలిట.. వాడి పారేసే సెలైన్ బాటిళ్లు సంజీవనిగా మారాయి. ఇప్పడు ఆస్పత్రి ఆవరణంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా కనిపిస్తోంది.
అందరికీ ఆదర్శం
రహదారులకు అడ్డువస్తున్నాయని, చిన్న చిన్న కారణాలతో చెట్లు నరుకుతున్న తరుణంలో... తాగడానికే నీరు లేని పరిస్థితుల్లో మొక్కలను రక్షించిన వైనం అందర్నీ ఆలోచింపజేస్తోంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.
- ఇదీ చూడండి : ఈ సంతలో వాహనాలూ దొరుకుతాయ్!