ప్రజలకు సేవలందించేందుకు అందుబాటులో ఉండే ఆధార్‌సెంటర్లు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఆధార్‌లో మార్పుల పేరుతో వేలకు వేలు దండుకుంటున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో మీసేవ సెంటర్ల ప్రతినిధులు. ఆధార్‌కార్డులో వయసులో తప్పులు ఉండడం వల్ల చాలా మంది బీడీ కార్మికులు పింఛను పొందలేక పోతున్నారు. ఇదే అదునుగా భావించిన మీసేవ సెంటర్ల ప్రతినిధులు గ్రామాల్లో దళారీలను నియమించుకుని వారి ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఒక్కొక్కరి నుంచి సుమారు రెండువేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన 50 మంది బీడీ కార్మికులు జిల్లా కేంద్రంలోని మీ సేవ కేంద్రానికొచ్చారు. ఆధార్‌లో మార్పులు కోసం.. అదే గ్రామానికి చెందిన వెంకన్న వారి వద్ద నుంచి రెండు వేల రూపాయల చొప్పున తీసుకున్నట్లు వాపోయారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయానికి సమీపాన ఉన్న మీసేవా కేంద్రంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. మీసేవా కేంద్రాల దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా... తక్షణ విచారణ జరిపి వాస్తవమైతే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.