బహుళార్ధక సాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ ఇప్పుడు నందికొండ పేరుతో పురపాలక ఎన్నికల్లో పోటీపడుతోంది. 2018 ఆగస్టు 2న నందికొండను పురపాలికగా మారుస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కూడా కాని నందికొండ ఏకంగా పురపాలికగా అవతరించి రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది.
నందికొండలో ఆస్తి పన్ను ఉండదు
నందికొండలో అన్ని పురపాలికల్లోలా ఆస్తిపన్ను ఉండదు. కొత్త ఇంటి నిర్మాణాలకు అనుమతులుండవు. ఈ ప్రాంతమంతా ఎన్నెస్పీ (నాగార్జునసాగర్ ప్రాజెక్టు) ఆధీనంలో ఉండటంతో ఇక్కడి భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉంది. ఇక్కడి జనాభాకు కావాల్సిన మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్తు తదితరాలన్నీ ఎన్నెస్పీనే కల్పిస్తోంది. మొదట్లో ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. నిర్మాణ సమయంలో వచ్చిన వారితో పాటు నల్గొండ, ఆంధ్ర ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఇటీవలి కాలంలో వలస వస్తున్న వారు ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. దీంతో ఇక్కడి జనాభా కాలక్రమేణా పెరుగుతూ వస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 15885 కాగా.. తాజాగా 18 వేల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. ఇక్కడి ఓటర్లు ఇప్పటి వరకు కేవలం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే ఓటు వేశారు. ఇప్పుడు తొలిసారిగా పుర ఎన్నికల్లో ఓటు వేయబోతుండటం గమనార్హం.
అభివృద్ధి సంగతేమిటి?
పురపాలికకు ఆదాయ వనరులు లేకపోవడంతో ప్రత్యేకంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసే నిధులతోనే ఈ పురపాలికలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ వేలసంఖ్యలో ప్రాజెక్టుకు సంబంధించిన క్వార్టర్లు ఉన్నాయి. వీటి అద్దె ప్రస్తుతం ఎన్నెస్పీనే వసూలు చేస్తోంది. ఈ అద్దె వసూలును పురపాలికకు అప్పగిస్తే వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో పురపాలికలో అభివృద్ధి పనులు చేయొచ్చని గతంలో నల్గొండకు కలెక్టరుగా పనిచేసిన గౌరవ్ ఉప్పల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటివరకు ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు.
వార్షికాదాయం ఎక్కడా...?
మొత్తం 12 వేల 715 మంది ఓటర్లుండగా... అందులో పురుషులు 6 వేల 160, మహిళలు 6 వేల 555 మంది ఉన్నారు. ఈ పురపాలికలో 12 వార్డులున్నాయి. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో డ్యాం, నాగార్జున కొండ, బుద్ధవనం... ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పటివరకు అక్కడ మురికివాడల గుర్తింపు జరగకపోవటం వల్ల వార్షిక ఆదాయమనేదే లేకుండా పోయింది.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన