కొల్లాపూర్లో మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి... మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరు... మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిష్ఠానం నుంచి బీ-ఫారం దక్కిన వాళ్లంతా పార్టీ గుర్తుపై పురపోరుకు సిద్ధమైతే... ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, అసమ్మతి నేతలు ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పేరుతో అన్నివార్డుల్లో బరిలో దిగుతున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు నచ్చకనే వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నామని అసంతృప్తులు చెబుతున్నారు. తెరాసకు గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా అధిక స్థానాలు గెలుచుకుంటామంటున్నారు.
వ్యతిరేకంగా పోటీ చేస్తే... వేటే...
కొల్లాపూర్లోని అన్ని వార్డులను తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ధీమావ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయంటున్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ల గురించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. తెరాసకు వ్యతిరేకంగా బరిలో నిలిస్తే భవిష్యత్తులో తిరిగి పార్టీలో చేర్చుకోబోమని తేల్చి హచ్చరిస్తున్నారు.
సందట్లో సడేమియా...
ప్రస్తుతం తెరాస అభ్యర్థులు, తిరుగుబాటు, అసమ్మతి అభ్యర్థులు కొల్లాపూర్లో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ ప్రచారం చేయటాన్ని చూస్తూ... విస్తుపోవడం ఓటర్ల వంతవుతోంది. సందట్లో సడేమియా అన్నట్లుగా తెరాసలో వర్గపోరును సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తెరాస వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇతర పార్టీల గెలుపోటముల సంగతి పక్కన పెడితే కొల్లాపూర్ లో గెలిచేది బీరం వర్గమా? జూపల్లి వర్గమా అన్నది వాడవడనా ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'