కీకారణ్యం.. జనారణ్యమైయ్యే సమయం ఆసన్నమైంది. జంపన్నవాగు జనసంద్రంగా మారే రోజు దగ్గరకొచ్చింది. పెద్దా చిన్నా మేడారానికి ప్రయాణమైయ్యే శుభముహుర్తం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరంలో.... జాతర సందడి నెలకొననుంది. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు రోజుల పాటు మేడారంలో అంగరంగవైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు.
జాతర ఏర్పాట్లుకు రూ.75 కోట్లు విడుదల..
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన... సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించగా.. నెల రోజుల క్రితం పనులు ప్రారంభించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నా....అవి ఎక్కడా వేగం పుంజుకోవట్లేదు. భక్తుల కోసం 8,400 తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా.. అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
పునాది దశలోనే పలు పనులు...
జాతరకు వచ్చే భక్తులకు నీటి సరఫరా కోసం నాలుగు ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇవి పునాదుల దశల్లోనే ఉన్నాయి. జల్లు స్నానాల కోసం... జంపన్నవాగు వద్ద పైపుల నిర్మాణం చేయాల్సి ఉంది. దీంతో అమ్మలను దర్శించుకునేందుకు ఇప్పటికే వస్తున్న వారికి ఇక్కట్లు తప్పట్లేదు.
సమీక్షిస్తున్న అధికారులు...
రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో కూడా రహదారి నిర్మాణ పనులు కూడా ఇటీవలే ప్రారంభం అయ్యాయి. విద్యుత్ శాఖ పనులూ ముమ్మరం చేయాలి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో... ఆలయ ప్రహరీకి రంగులేయడం, క్యూలైన్ల మరమ్మతులు, కళ్యాణ కట్టల నిర్మాణం, చలువ పందిళ్లు తదితర పనులు చేయాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి...పలుమార్లు సమీక్షలు జరిపి...పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సారి జాతర ప్లాస్టిక్ రహితం..
ఇప్పటికే ప్లాస్టిక్ రహిత జాతరగా మేడారంను నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆ మేరకు ప్లాస్టిక్ నియంత్రణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా జాతరలో వ్యాపారులకు....ప్లాస్టిక్ కవర్లు స్థానంలో 25 లక్షల పోచంపల్లి వస్త్ర సంచులను అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానంగా... తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం..జంపన్నవాగు వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు మరింత శ్రద్ధ పెడితేనే అనుకున్న గడువుకు అవి పూర్తవుతాయి. అధికారులు సమన్వయంతో... ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతూ.... జాతర పనులు పూర్తి చేయకపోతే.... వచ్చే భక్తకోటికి కష్టాలు తప్పవు.
ఇదీ చూడండి: సరకు రవాణాకు.. సిద్ధం కాబోతున్న ఆర్టీసీ బస్సులు