ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి 15 ఏళ్ల క్రితం 1/2 సర్వే నంబర్ గల భూమిలో 35 ఎకరాలు, 354 సర్వే నంబర్ గల భూమిలో 35 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆ భూమిలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి పత్తి, ఆముదం పంట సాగు చేస్తుండేవాడు. ఈ ఏడాది జామాయిల్ సాగువైపు మొగ్గు చూపి 70 ఎకరాల్లో 20 లక్షల వ్యయంతో మొక్కలు నాటించాడు. నాటిన నెలరోజులకే కొందరు కబ్జాదారులు 10 ఎకరాల్లోని జామాయిల్ మొక్కలను తొలగించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోకపోవడం వల్ల చేసేదేం లేక మళ్లీ ఆ పదెకరాల్లో జామాయిల్ మొక్కలు నాటించాడు.
ఈ నెల 26న కబ్జాదారులు మరోసారి 35 ఎకరాల్లోని జామాయిల్ మొక్కలను తొలగించారు. మల్లారెడ్డి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న తన భూమిలో కబ్జాదారులు వేములపల్లి భిక్షపతి, బంచె రాంమోహన్రెడ్డిలు వెంటపడి మరీ పంటను నాశనం చేస్తున్నారని వాపోయాడు.
తమ ఇష్టపూర్వకంగానే మల్లారెడ్డికి తమ భూమిని అమ్ముకున్నామని.. భూమి అమ్మిన రైతులు స్థానిక ఎమ్మార్వో ముందే చెప్పారని.. అధికారులు విచారణ జరిపి భూమి తనదేనని కబ్జాకోరులకు స్పష్టంగా తేల్చి చెప్పినా పదే పదే తనను ఇబ్బంది పెడుతున్నారని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
పోలీసులు కబ్జాకోరులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కబ్జాకోరుల నుంచి మల్లారెడ్డికి న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. తనకు పోలీసులు అండగా నిలిచి దుండగుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. భూమిలో అక్రమంగా ఎవరూ రాకుండా కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని, తనకు పోలీసులు న్యాయం చేయాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు.
- ఇదీ చూడండి : ముత్యాల నగరంలో కురిసిన చినుకులు