కీకారణ్యం జనారణ్యంగా మారి...భక్తులతో కిటకిటలాడే మేడారం మహా జాతరకు సమయం దగ్గర పడుతున్నా పనులు వేగం పుంజుకోవడం లేదు. రెండేళ్లకోసారి వచ్చే మేడారం జన జాతరను దర్శించుకునేందుకు కోటిన్నరకు పైగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. మేడారానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో రహదారి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అసలు పూర్తవుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి.
తవ్వి వదిలేసిన రోడ్లు
మేడారానికి వెళ్లే చాలా మార్గాల్లో బ్రిడ్జ్, కల్వర్టులు, రోడ్డు వెడల్పు పేరుతో రహదారులను తవ్వి వదిలేశారు. ఆలేరు నుంచి మెదలుకొని, రఘనాథపల్లి, స్టేషన్ ఘన్ పూర్ వద్ద చాలా చోట్ల వంతెనల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ మీదగా పరకాల వచ్చే రహదారి పనులు పదేళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఆత్మకూరు నుంచి గూడెప్పాడుకు వెళ్లే జాతీయ రహదారి పూర్తికాక పోవడం వల్ల అటుగా వచ్చే వాహనదారులకు తీవ్ర సమస్యగా మారింది. అధ్వాన రోడ్ల కారణంగా గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి.
హైదరాబాద్ జాతీయ రహదారిలో వస్తే అంతే...
హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపైన గుంతలతో అస్తవ్యస్తంగా మారింది. సాధారణ సమయాల్లోనే రద్దీగా ఉండే ఈ మార్గం మేడారం మహాజాతర సమయంలో మరింత రద్దీగా మారనుంది.
పూర్తికాని 365 జాతీయ రహదారి నిర్మాణం పనులు
365 జాతీయ రహదారి నిర్మాణం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి నుంచి వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం భూపతిపేట మధ్య కల్వర్టులు, వంతెనలు పూర్తి కాకపోవడం వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలన్ని ఈ రహదారి నుంచే వెళ్లాలి. మేడారం పరిసర ప్రాంతాల్లో రహదారులు వేసినా నాణ్యతా లోపం బట్టబయలైంది.
మంత్రులు ఆదేశించినా...
మంత్రులు ఎర్రబెల్లి దయకరరావు, సత్యవతి రాథోడ్ రహదారి పనులపై పలుమార్లు సమీక్షించి త్వరగా చేయాలని ఆదేశించినా....పూర్తిస్థాయిలో వేగం పుంజుకోవట్లేదు. జాతర దగ్గరకొచ్చే సమయంలో మమ అనిపించే విధంగా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మేడారం జాతరకు ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఇప్పటికైనా రహదారుల మరమ్మతులపై యుద్ధప్రాతిపదిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చూడండి: 'మేడారం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే'