ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని జాతీయ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే అనేక ఆంక్షలు విధించి రైతాంగాన్ని తిప్పలు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఆంక్షలు విధిస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల కన్నీళ్లకు కారణమవుతున్నారని ఆరోపించారు.
వ్యవసాయం చేసే రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని అన్నారు. పక్క రాష్ట్రం ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా రూ. 2500 గిట్టుబాటు ధర కల్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరికి మంచి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క జిల్లా కలెక్టర్, డీసీఓకు ఫోన్ చేసి పండించిన 1075 ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. రేపటిలోగా కొనుగోలు చేస్తామని అధికారుల హామీ మేరకు ధర్నా విరమించారు.
ఇదీ చూడండి : ఘోర రోడ్డు ప్రమాదం... 250గొర్రెలు మృతి