హైదరాబాద్ దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చర్చ్ గాగిల్లపూర్ వద్ద ఈనెల 15న జరిగిన యాదగౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు, యాదగౌడ్ భార్యను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన యాదగౌడ్ తన కుటుంబంతో కలిసి ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. చర్చ్ గాగిల్లపూర్ వద్ద నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యాదగౌడ్కు డీసీఎం డ్రైవర్ ఆసిఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరచూ ఇంటికి వస్తుండడం వల్ల యదగౌడ్ భార్యతో ఆసిఫ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన యాదగౌడ్ తన భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. యాదగౌడ్ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 15న సాయంత్రం పథకం ప్రకారం.. యాదగౌడ్ ఇంటికి వచ్చిన ఆసిఫ్ మద్యం తాగేందుకు రమ్మని సమీపంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వద్దకు తీసుకెళ్లాడు. మద్యం తాగిన అనంతరం.. యాదగౌడ్‌ను ఆసిఫ్ కత్తితో హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించిన యాదగౌడ్ భార్యను అరెస్ట్‌లో చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: 'అమీన్పూర్ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'