మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర భూవ్యవహారం కేసులో భారీగా లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్ నాగరాజు.... స్థిరాస్తి దళారులు శ్రీనాథ్, అంజిరెడ్డి, వీఆఏ సాయిరాజ్‌ను అనిశా అధికారులు రిమాండ్‌కు తరలించారు. శనివారం నాంపల్లిలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ అనంతరం వీరిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించగా... నిందితులను చంచల్‌గూడా కారాగారానికి తరలించారు. ఈ కేసులో పట్టుబడిన డబ్బు సహా తహసీల్దార్ ఇంట్లో లభ్యమైన నగదు మొత్తం కోటి 46లక్షల రూపాయలకు సంబంధించి ఆదాయపు పన్ను అధికారులకు సమాచారమిచ్చారు.
కోటీ 10 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటికొస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. చట్టపరంగా అన్ని దస్త్రాలు ఉన్నప్పటికీ పట్టా పాస్‌బుక్ ఇవ్వకుండా నాగరాజు చాలా ఇబ్బందులు పెట్టాడని ఓ విశ్రాంత అదనపు ఎస్పీ ఆరోపించారు. కలెక్టర్‌తో పాటు రెవెన్యూశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నాగరాజు లక్ష రూపాయలు లంచమడిగి అతని ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలున్నాయి.
తండ్రి చనిపోతే కారుణ్య నియామకంలో భాగంగా రెవెన్యూ శాఖలో టైపిస్ట్‌గా చేరిన నాగరాజు.. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందాడు. శామీర్‌పేటలో పనిచేస్తున్నప్పుడు తొమ్మిదేళ్ల క్రితం అనిశా అధికారులు... అక్రమాదాయం కేసులో అల్వాల్‌లోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. నగదు, బంగారు ఆభరణాలు కలిపి అప్పట్లోనే కోటి 20 లక్షలు పట్టుబడింది. ఖరీదైన మద్యం సీసాలను అధికారులు గుర్తించారు. అక్రమాదాయం కేసులో కొన్ని నెలల క్రితమే నాగరాజుకు ఊరట లభించినా... తాజాగా ఆయన వద్ద 38 లక్షల నగదు, అర కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా అనిశా అధికారులు మరోమారు అక్రమాదాయ కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కీసర భూదందా కేసులో రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి చెందిన ప్రముఖ నేత సోదరుడి హస్తం ఉందంటూ.... రాంపల్లిదాయర రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని కొందరితో కలిసి భూఆక్రమణలకు పాల్పడుతున్నాడని తెలిపారు.