విద్యార్థుల కేరింతలతో సందడిగా ఉండాల్సిన ఆ పాఠశాల ఇప్పుడు బోసిపోయింది. పట్టుమని 15 మంది విద్యార్థులు కూడా లేక వెలవెలబోతోంది. ప్రైవేటు పాఠశాలలు, ఆంగ్ల మాధ్యమాల ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.
అప్పుడు 450.. ఇప్పుడు 14
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని జిల్లా పరిషత్ పాఠశాలలో కేవలం 14 మంది విద్యార్థులే ఉన్నారు. వారికోసం 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు మాధ్యమం ఉన్న సమయంలో విద్యార్థుల సంఖ్య 450 వరకు ఉండేది. వారంతా ప్రైవేట్ బాట పట్టడం వల్ల పిల్లల సంఖ్య క్రమేణా తగ్గిపోయింది.
ఆంగ్ల మాధ్యమం పెట్టినా...
ఇదంతా గమనించి ప్రధానోపాధ్యాయుడు సూర్యప్రకాష్... ఆంగ్ల మాధ్యమంలో అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం, విద్యాబోధనపై ఉపాధ్యాయులు ఊరంతా తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఎంతో కష్టపడి 50 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు.
ప్రైవేట్ బాటలో విద్యార్థులు
పాఠశాల మూసివేస్తారన్న ప్రచారంతో విద్యార్థులంతా మళ్లీ ప్రైవేట్ బడి బాట పట్టారు. చివరకు 14 మంది మిగిలారు. ఆరో తరగతిలో నలుగురు, ఏడులో ముగ్గురు, ఎనిమిదిలో నలుగురు, తొమ్మిదిలో ఒక్కరు, పదిలో ఇద్దరు చదువుతున్నారు.
14 మందిలో 4గురు గైర్హాజరు
వీరిలో 9 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు. ప్రతిరోజు నలుగురు వరకు గైర్హాజరవుతూనే ఉంటారు. అంటే 10 మందికి ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షలు రాసిన ఇద్దరు విద్యార్థులూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇక్కడి ఉపాధ్యాయులంతా గత బదిలీల్లో ఇక్కడకు వచ్చారు.
బదిలీయే మార్గం
మిగిలిన 14 మంది విద్యార్థులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పిస్తామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. 8 మంది ఉపాధ్యాయుల సేవలను కూడా.. అవసరం ఉన్న పాఠశాలల్లో వినియోగించుకుంటామని తెలిపారు. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ పాఠశాల విద్యార్థులు లేక మూతపడాల్సి వస్తోంది.
- ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత