తమకు అభ్యర్థులే కరవయ్యారని తెరాస చేస్తోన్న విమర్శలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తిప్పికొట్టారు. తెరాసలో ఉన్నట్లుగా కోట్లు ఖర్చు చేసే అభ్యర్థులు, భూ మాఫియా అభ్యర్థులు, వైట్ మాఫియా అభ్యర్థులు భాజపాకు లేరని గుర్తు చేశారు. ప్రజా సేవకు, పార్టీకి అంకితమైన నిజమైన కార్యకర్తలే భాజపా తరఫున బరిలో ఉన్నారని స్పష్టం చేశారు.
తెరాసకు ప్రచారం చేసే ముఖమే లేదు...
మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, భూత్పూర్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అధికార పార్టీకి ప్రచారం చేసే ముఖమే లేదని మండిపడ్డారు. కేంద్రం అమృత్, స్మార్ట్ సిటీ పథకాల ద్వారా పట్టణాలను అభివృద్ధి చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులే ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూంలు ట్రబుల్ బెడ్ రూంలుగా మారాయని అన్నారు. ఇళ్ల కోసం కేంద్రం ఇస్తోన్న నిధుల్ని మళ్లిస్తున్నారని ఆరోపించారు.
అశోకుడు చెట్లు... కేసీఆర్ మద్యం దుకాణాలు
అశోకుడు చెట్లు నాటిస్తే.. కేసీఆర్ రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలు పెట్టి తాగుబోతుల తెలంగాణ తయారు చేశారని భగ్గుమన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెరాసకు వేసినట్లేనని... తెరాసకు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ఓటు వృధా కాకూడదంటే భాజపాకే ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : పురపోరులో తెరాసకు ఇంటిపోరు