మహబూబ్‌నగర్ జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల వెలువడిన టీఆర్టీ ఫలితాల్లో ఎస్జీటీగా ఎంపికైన యువతి సురేఖ డెంగీ బారిన పడి చికిత్స తీసుకుంటుండగానే.. సెలైన్ సీసాతోనే అంబులెన్స్‌లో కౌన్సిలింగ్‌కు వచ్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సురేఖ ఎస్జీటీగా ఎంపికయ్యారు. వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నారు. ఆదివారానికి ప్లెట్లెట్ల సంఖ్య 44 వేలకు పడిపోయింది. సోమవారం ఉదయానికి 19వేలకు తగ్గిపోయింది. అదే రోజు కౌన్సిలింగ్ ఉన్నందున యువతి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అధికారులను సంప్రదించి మినహాయింపు కోరడానికి ప్రయత్నించారు.
సురేఖ అందుకు అంగీకరించలేదు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని కోరింది. అంబులెన్స్‌లో సెలైన్ సీసాతోనే కుమార్తెను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కౌన్స్‌లింగ్ హాల్‌కు తీసుకువచ్చారు. ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లి పాఠశాలను ఎంపిక చేసుకున్న సురేఖ తిరిగి చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లారు.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!