దిశ దుర్ఘటన యావద్దేశాన్ని కదిలించింది.. సామాన్యుడి మొదలు దేశ ప్రధానమంత్రి దాకా అందరూ ‘అరే.. ఇలా జరిగిందేమిటీ! సమాజంలో ఇటువంటి దురదృష్టకర ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడద’ని అనుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ప్రజాగ్రహం పెల్లుబికిన నేపథ్యంలో వారం రోజులు తిరగ్గానే నలుగురు నిందితుల ఎన్‌కౌంటరు కూడా చకచకా జరిగిపోయింది. అప్పటిదాకా పోలీసులపై రాళ్లు రువ్విన జనం ‘ఎన్‌కౌంటరు’ ఘటన తర్వాత పూలు చల్లారు. ఈ చర్యతో అమ్మాయిల వైపు దుర్భుద్ధితో చూడాలన్నా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుందని అంతా చెప్పుకొన్నారు. కానీ, దిశ ఉదంతం జరిగిన పక్షం రోజుల్లోనే ఇదే పాలమూరు ఉమ్మడి జిల్లా పరిధిలో పలు అత్యాచార.. వేధింపుల ఘటనలు వెలుగు చూశాయి. పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ మహిళలపై అకృత్యాలు ఆగలేదన్నది చేదునిజం.
బంధువులే విలన్లు :
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటివరకు నమోదైన పోక్సో కేసులను పరిశీలిస్తే.. చాలావరకు బంధువులు, ఇరుగుపొరుగు వారే నిందితులుగా తేలారు. ప్రధానంగా యువత సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో వస్తున్న అశ్లీల వీడియోలను చూసి వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతోపాటు అంతర్జాలం గ్రామీణస్థాయిలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. వీటిలో నీలిచిత్రాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా మారి.. పిల్లల నడవడికపై దృష్టి సారించకపోవడం కారణంగానే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. మహిళలు.. బాలికలపై వేధింపుల కేసుల్లో ఓవైపు కఠినంగా వ్యవహరిస్తూనే.. మరోవైపు అవగాహన కార్యక్రమాలు కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 50కు పైగా అవగాహన కార్యక్రమాలు పెట్టామని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. పిల్లల చేతుల్లో ఫోన్ల వినియోగం, నడవడికపై తల్లిదండ్రులు సైతం దృష్టి సారించాలన్నారు. విద్యాలయాల్లోనూ మంచి విషయాలు చెప్పేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆగని బాల్యవివాహాలు :
దిశ ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న బాల్యవివాహాల కోణాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో ఓ నిందితుడి భార్య ప్రస్తుతం గర్భవతి. పాఠశాల బోనఫైడ్ ధ్రువపత్రం ప్రకారం ఈ భార్యాభర్తలిద్దరూ మైనర్లే. గ్రామాల్లో చిన్న ఘటన జరిగిన ఊరంతా తెలుస్తుంది. అలాంటిది ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకుంటే ఐసీడీఎస్ పర్యవేక్షకులతో సహా ఇతర శాఖల అధికారుల దృష్టికి అసలు వెళ్లలేదు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి గర్భిణుల వివరాలు సేకరిస్తారు. నిందితుడి భార్య మైనరు అని వారు కూడా గుర్తించలేకపోయారు. గత అయిదేళ్లలో 300కు పైగా బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు జిల్లా బాల సంరక్షణాధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంటే.. చాప కింద నీరులా ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న మాటే. గతేడాది బాల్యవివాహాలపై ‘ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం’ (సెస్) సర్వే వివరాలను వెల్లడించింది. మహిత స్వచ్ఛందసంస్థ సహకారంతో సెస్ పాలమూరు జిల్లాలో బాల్యవివాహాలపై అధ్యయనం చేసింది. రాష్ట్రంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగతున్న 9 జిల్లాల్లో మహబూబ్‌నగర్ (నారాయణపేట జిల్లాతో కలిపి), జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నట్లు తేల్చింది. 86 శాతం పేదరికం కారణంగానే ఇలా చేసుకుంటున్నారన్నది అధ్యయన సారాంశం.
మరికొన్ని రోజులు మృతదేహాలు అలాగే.. :
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటరు జరిగి అపుడే పది రోజులు గడిచిపోయాయి. కోర్టు ఆదేశాలతో మృతదేహాలు పాడవకుండా ఆ రోజు నుంచి కాపాడుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నలుగురి మృతదేహాలను భద్రపరిచారు. సాధారణంగా మృతదేహాలు ఒక్కరోజు గడిచినా కుళ్లిపోతాయి. అలా జరగకుండా శీతలీకరణ ప్రక్రియ ద్వారా భద్రపరచవచ్చని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంటు రాంకిషన్ ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు తెలిపారు.
గత 17 రోజుల్లో జిల్లాలవారీగా అత్యాచార కేసుల నమోదు ఇలా..
మహబూబ్‌నగర్ : 04
వనపర్తి : 02
జోగులాంబ గద్వాల : 01
నాగర్‌కర్నూల్ : 02
నారాయణపేట : 04
దిశ తర్వాత మచ్చుకు కొన్ని దుర్మార్గాలు..
డిసెంబరు 8న : అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి చరవాణిలో నీలిచిత్రాలు చూపించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించగా.. వెల్దండలో పోక్సో కేసు నమోదైంది.
డిసెంబరు 9న : మహబూబ్‌నగర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో రాములు అనే మేస్త్రీ తన వద్ద కూలీ పనులకు వచ్చే ఓ బాలికతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె పురుగులమందు తాగింది.
డిసెంబరు 11 : అయిజ మండలానికి చెందిన లక్ష్మన్న అలియాస్ కునాల్ బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తల్లిదండ్రులు ఒకరోజు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డిసెంబరు 14 : వనపర్తి మండలంలోని ఓ గ్రామంలో పదకొండేళ్ల కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోక్సో కేసు నమోదైంది.