కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటనపై రీజనల్ కో ఆర్డినేటర్ లక్ష్మయ్య విచారణ చేపట్టారు. ఉదయం సమయంలో విద్యార్థులను, ప్రిన్సిపాల్, సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. గర్భం దాల్చింది కేవలం ఒక్క అమ్మాయేనని స్పష్టం చేశారు. అయితే కొందరి పిల్లలకు నెలసరిగా రాకపోవడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్తే... అందులో ఇద్దరికి గర్భ నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. అయితే మరో సారి పరీక్షలు నిర్వహించగా... అందులో ఒకే ఒక్క అమ్మాయి గర్భం దాల్చినట్లు వచ్చిందని తెలిపారు.
ప్రియుడి వల్లే గర్భం...
ఈ విషయంపై అమ్మాయిని విచారించగా... ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన పక్కింటి అబ్బాయితో ప్రేమ కలాపాలు సాగించానని, అందువల్లే గర్భం వచ్చిందని చెప్పినట్లు లక్ష్మయ్య తెలిపారు. అయితే ఆమె ఆగస్టు 7న కళాశాలకు వచ్చిందని... అమ్మాయి ఇంటి వద్ద ఉన్నప్పుడే ఆమెకు గర్భం వచ్చిందని పేర్కొన్నారు. ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు.
తప్పుడు వార్తలు వద్దు...
ఈ విషయంలో తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని లక్ష్మయ్య మీడియాను కోరారు. కేవలం ఒక్క అమ్మాయి గర్భం దాలిస్తే... ముగ్గురు గర్భం దాల్చారని రాయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అమ్మాయి వ్యక్తిగత విషయం గురించి వార్తలు సరికాదని సూచించారు. ఈ విషయంతో ప్రిన్సిపాల్కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి: వ్యవసాయాన్ని పండగ చేద్దాం