మంచి జరిగినా... చెడుజరిగినా అంతా దైవసంకల్పమే అనుకునే సంప్రదాయాలు మనవి. పండిన పంటలో తొలి భాగాన్ని దేవుడికి చెల్లించడం చాలా మందికి ఆనవాయితీ.. అలాంటి ఆనవాయితీనే ఓ ఊరంతా పండుగగా చేసుకుంటున్నారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల- నారాయణపూర్ గ్రామాల మధ్యలో వెలసిన మల్లన్న ఆలయంలో బోనాల పండగ వైభవంగా జరుగుతోంది. పంట చేతికొచ్చిన తర్వాత మల్లన్నకు బెల్లం, బియ్యంతో కలిపి చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అనాదిగా ఆచరిస్తున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
షష్టి బోనాల పండుగ పేరుతో పిలుచుకునే ఈ వేడుకలో.. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి దేవున్ని కొలుస్తారు. వారంపాటు నిష్టగా ఉండి.. ఎనిమిదో రోజున ఇంటిల్లపాది ఉపవాసం ఉండి... కొత్త కుండలో పంట బియ్యం, పాలు, బెల్లంతో పాయసం వండి దేవుడికి బోనాలు సమర్పిస్తారు.
కూరగాయలతో వంటలు చేసుకుని దేవుడి సన్నిధిలో సహపంక్తి భోజనాలు చేస్తారు. మల్లన్నను మనసారా మొక్కితే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు జరిగే ఈ వేడుకను చూడాలంటే ఆసిఫాబాద్‌కు వెళ్లాల్సిందే.
ఇదీ చూడండి: రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్