అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10స్థానాలకు తెరాస కేవలం ఒకేచోట గెలిచింది. ఆ తర్వాత స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు విజయాలను ఖాతాలో వేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 5 మున్సిపాలిటీలు ప్రస్తుతం ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. మొత్తం 5 మున్సిపాలిటీల్లో పాగా వేయడమే లక్ష్యంగా గులాబీ దండు ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
తెరాసను ఢీకొనేందుకు మిగతా రాజకీయ పార్టీలన్నీ ఏకమై బరిలో నిలిచాయి. ఇల్లందు, వైరా మినహా అన్ని పురపాలక సంఘాల్లో కాంగ్రెస్, తెదేపా అవగాహనతో పోటీ చేస్తుండగా.. కొత్తగూడెం, మధిర పురపాలక సంఘాల్లో కాంగ్రెస్, తెదేపా, సీపీఎం, సీపీఐలు కలిసి పోటీ చేస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తెదేపా కలిసి తెరాసను ఢీ కొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఇక పలు మున్సిపాలిటీల్లో మాత్రం తెరాసకు రెబల్స్ గండం తప్పడం లేదు.
20 వార్డులున్న వైరా మున్సిపాలిటీ ఈసారి ఎస్సీ జనరల్ స్థానానికి రిజర్వేషన్ కేటాయించబడింది. దీంతో...అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ తెరాస ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. 3వ వార్డును తెరాస ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగతా 19 స్థానాల్లో తెరాస, కాంగ్రెస్ కూటమి(కాంగ్రెస్, తెదేపా, సీపీఐ) పోటాపోటీగా ప్రచారాన్ని చేస్తున్నాయి. భాజపా 10 స్థానాల్లో బరిలో ఉంది.
మధిర మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా సాగుతోంది. పురపాలికను గెలుచుకునేందుకు తెరాస, కాంగ్రెస్ సై అంటే సై అంటున్నాయి. తెరాసను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 22 వార్డుల్లో విపక్షాలన్నింటిని కలుపుకుని బరిలో దిగుతోంది. మధిర గెలుపును అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్గ, తెరాస నుంచి జడ్పీ ఛైర్మన్ కమల్ రాజ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.
సత్తుపల్లి మున్సిపాలిటీలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతోంది. 23 వార్డులున్న సత్తుపల్లి మున్సిపాలిటీలో తెరాస ఇప్పటికే 6 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుంది.రాష్ట్రంలోనే పరకాల తర్వాత ఎక్కువ ఏకగ్రీవాలైన మున్సిపాలిటీగా సత్తుపల్లి నిలిచింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 ఏకగ్రీవాలు చేయగలిగారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి జనరల్ స్థానానికి కేటాయించడం వల్ల...తీవ్ర పోటీ నెలకొంది.
కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా..తెరాస ఒంటరిగానే పట్టణ ప్రజలనుఓట్లు అభ్యర్థిస్తోంది. తెరాసను ధీటుగా ఎదుర్కొనేందుకు మాత్రం కాంగ్రెస్, తెదేపా, సీపీఎం, సీపీఐ లు కలిసి బరిలో నిలిచాయి. తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి 26 స్థానాల్లో మిగతా పక్షాల మద్దతుతో కలిసి సీపీఐ పోటీలో ఉంది.
ఇల్లెందు పురపోరు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తెరాసకు తెరాస రెబల్స్‌తో తీవ్ర పోటీ ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ మడత రమా వెంకట్ గౌడ్ వర్గం... అన్ని వార్డుల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. 24 వార్డుల్లో తెరాస ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీపీఎం, సీపీఐతో కలిసి పోటీ చేయాలని భావించినప్పటికీ.. పొత్తులు ఫలించలేదు.
మొత్తంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని ఎన్నికలు జరిగే 5 మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలన్న సంకల్పంతో తెరాస పనిచేస్తుంటే...మధిరలో భట్టి విక్రమార్క రూపంలో, ఇల్లెందులో తెరాస అసమ్మతి వర్గం రూపంలో గులాబీ దండుకు గట్టి పోటీ తప్పడం లేదు. కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలోని కూటమి తెరాసతో ఢీ కొడుతోంది. సత్తుపల్లి, వైరా పురపాలికల్లో మాత్రం తెరాస విజయం నల్లేరుపై నడకలాగే కనిపిస్తోంది. అయితే రెబల్స్ రూపంలో పలుచోట్ల తెరాసకు తలనొప్పులు ఎదురవుతున్న వేళ...ఛైర్మన్లు, ఛైర్ పర్సన్ల ఎంపిక కూడా ఆ పార్టీకి సవాల్‌గానే మారుతోంది. అన్ని చోట్ల ఆశావహుల నుంచి గట్టి పోటీ ఉండంతో...గులాబీ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..