ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద బట్టబయలైన అక్రమ గంజాయి రవాణా వ్యవహారం... పోలీసు యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసింది. విశాఖ నుంచి మొదలైన గంజాయి రవాణా ప్రయాణం... దాదాపు 500 కిలోమీటర్లు దాటుకొని డ్రైవర్ అతివేగం వల్ల ప్రమాదంతో బయటపడింది.
పోలీసులే షాక్‌కు గురయ్యారు
ఇల్లెందు నుంచి ఖమ్మం రహదారిలోనే ఏడాదిన్నర కాలంలో వరుసగా మూడోసారి ప్రమాదాలతో గంజాయి గుట్టు బట్టబయలైంది. విశాఖ ఏజెన్సీ నుంచి.. భారీగా గంజాయి ప్యాకెట్లతో బయలుదేరిన వాహనం ఖమ్మంకు కూతవేటు దూరంలో ప్రమాదానికి గురైంది. నిద్రమత్తు, మూలమలుపు, అతివేగం వల్ల వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృత్యువాత పడగా.. వాహనంలోని గుట్టలుగా ఉన్న గంజాయి సంచులను చూసి పోలీసులు అవాక్కయ్యారు.
ప్రైవేటు వ్యక్తులతో తరలింపు
పక్కావ్యూహంతో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న ముఠాలు చేతికి మట్టి అంటకుండా... కేవలం ప్రైవేట్ వ్యక్తులతో తరలిస్తున్నారు. గతంలోనూ ఖమ్మం జిల్లాలో.. ఇదేతరహాలో భారీగా గంజాయి పట్టుబడింది. కారేపల్లి వద్ద కొబ్బరిబోండాల లోడులో గుట్టుగా సాగుతున్న అక్రమ గంజాయి తరలింపు ప్రమాదం వల్లే వెలుగుచూసింది. చెట్టును ఢీకొని వాహనం బోల్తాపడటంతో... దాదాపు రూ.50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దందాపై ఉక్కుపాదం మోపాలి
కల్లూరు, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, వైరాలోనూ చాలా సార్లు భారీస్థాయిలో గంజాయిని పట్టుకున్న దాఖలాలున్నాయి. పోలీసుల నిఘాను దాటుకుంటూ గంజాయిని తరలిస్తున్న ముఠాలు యంత్రాంగానికి సవాల్ విసురుతున్నాయి. రోడ్డు మార్గానే కాకుండా...రైళ్లలోనూ సాగుతున్న దందాపై ఉక్కుపాదం మోపాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి: లైవ్ వీడియో: తహసీల్దార్‌ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్