కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గొంతుకోసి హతమార్చాడు. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ముత్తా రాధికగా గుర్తించారు.
రాధిక తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం వారు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో కుమార్తె పడి ఉండటం చూసి తీవ్ర ఆవేదనకు గురై బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో ఘటన జరిగిన ప్రాంతంలో తనిఖీ చేశారు. అయితే దుండగుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుడి కోసం గాలిస్తున్నారు.