పాలమూరు జిల్లాలోని అతిపెద్ద సంస్థానం గద్వాలలో శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి కొలువై ఉన్నారు. కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేర్చే చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 17వ శతాబ్దంలో సోమనాథ భూపాలుడు నిర్మించారు. శ్రీ చెన్నకేశవ స్వామి... వీరత్వానికి, శౌర్యానికి, విజయానికి మారుపేరు. అందుకే రాజులు, యుద్ధ వీరులు ఎక్కువగా స్వామివారిని కొలిచేవారు.
శత్రు రాజ్యాలు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని తాక కూడదని భూపాలుడు కోట చుట్టూ ఒక కందకం తవ్వించారు. ఆ కందకంలో మొసళ్ళు పెంచే వారని ఇక్కడివారు చెబుతారు. మూడు వందల సంవత్సరాల క్రితమే మట్టితో నిర్మించిన ఈ కోట గోడలు ఇప్పుడు మనకు శిథిలావస్థలో కనబడుతున్నాయి.
కుడి ఎడమైంది :
సాధారణంగా విష్ణుమూర్తికి కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, మరో చేతిలో గద ఉంటుంది. కానీ ఈ ఆలయంలో కొలువైన చెన్నకేశవ స్వామికి కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, మరో చేతిలో గద దర్శనమిస్తోంది. ఇదే ఈ ఆలయాన్ని ప్రపంచంలోని విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ప్రాచీన శిల్పకళా వైభవానికి ప్రతీక
నిర్మాణపరంగా ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది. ఈ కోవెలలో పురాణ ఘట్టాలు దర్శనమిస్తాయి. ప్రాచీన శిల్పకళా వైభవం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అద్భుతమైన కళాఖండాలకు ప్రతిరూపంగా ఈ ఆలయ స్తంభాలు నిలుస్తున్నాయి. గుడిలోని శిల్ప కళా నైపుణ్యం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుతం ఈ గుడి బాధ్యతను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చూసుకుంటోంది.
ఇతర రాష్ట్రాల నుంచి
భూలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి వారికి ఆగమశాస్త్ర ప్రకారం... నిత్యం నివేదనలు, పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరినీళ్ళతో స్వామివారిని అభిషేకిస్తారు. ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.
- ఇదీ చూడండి : 'సింగపట్నం' పిలుస్తోంది... 'సింగోటం' రారమ్మంటోంది!