మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు రంగంలో దిగుతూ ఎన్నికల వేడి పెంచుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఒకే స్థానానికి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయగా... ఇంకొందరు ఒకేపార్టీ అభ్యర్థులుగా వేర్వేరు వార్డుల్లో బరిలో నిలిచారు. జనగామలో ఒకే ఇంటి నుంచి తల్లికూతుళ్లు పోటీ చేయగా... మరో చోట భార్యాభర్తలు బరిలో దిగి ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు.
భార్య కౌన్సిలర్..భర్త సీఎం..
జనగామకు చెందిన మల్లారెడ్డి, కల్యాణి భార్యాభర్తలు. ఇప్పుడీ దంపతులు చేరో వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు గెలిచిన కల్యాణి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. మల్లారెడ్డి తొలిసారి పోటీ పడుతున్నారు. అయితే..ఇన్నాళ్లు కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సమయాల్లో తన భార్యను తీసుకెళ్లి... వచ్చేవరకూ చెట్ల కింద కాలాయాపన చేసేవాడు మల్లారెడ్డి. అందరూ ఆయన్ను సీఎం అంటూ సరదాగా పిలిచేవారు. ఆ సమయంలో ఆనందపడ్డా...సీఎం అంటే 'కౌన్సిలర్ మొగుడు' అని తెలిశాక కొంచెం బాధపడ్డారు. ఈ పిలుపును ఎలాగైనా తొలిగించుకోవాలని బరిలో దిగారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరు కలిసి... ఒకరికోసం ఒకరు ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కౌన్సిల్హాల్లో అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ దంపతులు.
అమెరికాలో చదివి కౌన్సిలర్‌గా పోటీ..
రిజర్వేషన్ల కారణంగా తండ్రి పోటీ చేయాల్సిన స్థానంలో అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసిన కుమార్తె బరిలో దిగింది. అంతకుముందు ఓసారి నామినేషన్ వేసి... అనంతరం ఉపహరించుకున్న వాళ్ల అమ్మ కూడా మళ్లీ పోటీ చేస్తోంది. గతంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి భార్య అరుణ, కూతురు మనీష... కాంగ్రెస్ తరఫున 3, 20 వార్డుల నుంచి పోటీ చేస్తున్నారు. తల్లీకూతుల్లిద్దరు పురపోరులో ప్రచారం చేస్తూ... అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరుతున్న నాన్న స్ఫూర్తితోనే పోటీకి దిగుతున్నట్లు మనీష చెబుతోంది. తల్లితో పాటు తననీ గెలిపించటం వల్ల జనగామను వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది మనీష.
భార్య పేరుతో కాకుండా తానూ... ప్రజా సేవలో ఉండి పేరు తెచ్చుకోవాలని ఒకరు, మహిళా రిజర్వేషన్ని అందిపుచ్చుకుంటూ... భార్య, కూతురిని బరిలో దింపి పదవి దక్కించుకునేందుకు మాజీ నేత చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి...!
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..