జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల రజిత, జ్యోతి ఇద్దరు అక్కా చెల్లెళ్లు... పదేళ్ల క్రితం తండ్రి చనిపోగా, తల్లి అనారోగ్యంతో నాలుగేళ్ళ క్రితం మరణించింది. ఉన్న నానమ్మ కుటుంబ కలహాల కారణంగా ఆ యువతులను ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయింది.
గ్రామస్థుల సాయం
నా అనే వారు ఎవరు లేక ఆ యువతులిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. గ్రామస్థుల సాయంతో ఓ చిన్న గుడిసె నిర్మించుకున్నారు. అక్క రజిత అదే గ్రామంలో 2,500 రూపాయల జీతానికి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తోంది. ఆ జీతంతోనే ఇళ్లు గడుపుకుంటూ.. చెల్లి జ్యోతిని డిగ్రీ చదివిస్తోంది.
క్షణక్షణం.. భయం భయం
ఆ గుడిసెలోకి తరచూ పాములు వస్తున్నందున యువతులిద్దరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పాముల భయంతో గుడిసెలో నిద్రించలేక.. వేరే వారి ఇంటికి వెళ్లలేక ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రభుత్వం తమను ఆదుకుని ఓ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ అక్కాచెల్లెళ్లు వేడుకుంటున్నారు. యువతుల దయనీయ స్థితి చూసి దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : చెట్టును ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..