5 వేల మంది జనాభాతో 1952లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన జగిత్యాల... ఆరున్నర దశాబ్దాల్లో ప్రథమశ్రేణి పురపాలికగా రూపాంతరం చెందింది. పదిసార్లు పుర ఎన్నికలు జరిగినా... జిల్లా కేంద్రం హోదాలో తొలిసారి నిర్వహిస్తున్న పోరు ఆసక్తి రేకేత్తిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జగిత్యాల బల్దియాను కైవసం చేసుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.
జగిత్యాల పీఠం కోసం తెరాస-కాంగ్రెస్ వ్యూహాలు
పది సార్లు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. ఒకసారి తెదేపా దక్కించుకుంది. ఈసారి ఎలాగైన తెరాస కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా... ప్రచారంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి బల్దియాను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి వ్యూహలు రచిస్తున్నారు.
నేతలకు పలకరిస్తున్న సమస్యలు...
మరోవైపు పట్టణంలో పలు సమస్యలు ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఇరుకు రోడ్లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి విస్తరణ పనులను కేవలం ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రాంతంలో చేపట్టి మిగతా ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు. కూరగాయల మార్కెట్ ఒకటే ఉండటం, వసతుల కల్పన చేపట్టకపోవటం వల్ల గ్రామాల నుంచి వచ్చే వర్తకులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు.
పార్కు విషయంలో నిరాశ...
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక శివారు ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే. ఇక పారిశుద్ధ్య నిర్వాహణలోపం, సెలవు దినాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు పార్కులు లేకపోవడంపై స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన జగిత్యాల మున్సిపాలిటీలో... పట్టణ సమస్యలు తీర్చే నాయకులకు మాత్రమే తమ ఓటు వేస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!