విజయా రెడ్డి హత్య ఘటన జరిగినా... రెవెన్యూ శాఖలో అవినీతి తగ్గటం లేదు. జగిత్యాల జిల్లాలో ఓ రైతు వద్ద 10 వేలు లంచం తీసుకున్నా... పని చేయకపోటంతో సదరు రైతు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. విచారించిన కలెక్టర్ వీఆర్వోను, వీఆర్‌ఏను సస్పెండ్ చేసి లంచం ఇచ్చిన సొమ్మును తిరిగి ఇప్పించాడు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన తాండ్ర నర్సయ్య అనే రైతుకు చెందిన నాలుగు గుంటల భూమి పట్టా చేయాలని గ్రామ వీఆర్వో రమేశ్ రెడ్డి వద్ద కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు 8 వేలు వీఆర్వోకు, వీఆర్‌ఏకు 2 వేలు లంచం కూడా ఇచ్చాడు. అయినా పని కాకపోవటంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
అక్కడే విచారించిన కలెక్టర్ వీఆర్వో వద్ద నుంచి 10 వేలు రైతుకు ఇప్పించి వీఆర్వో, వీఆర్‌ఏను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాడు. ఇన్నాళ్లు తిరిగినా.. పని కాకపోగా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో పట్టా మార్పిడి జరగటంతో పాటు లంచం సొమ్ము తిరిగి వాపస్ ఇప్పించటంతో రైతు సంతోషంగా వెళ్లిపోయాడు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రెవెన్యూ అధికారులను హెచ్చరించాడు.