ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు పెద్ద ఊరట లభించింది. వారికి రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అన్ని రీజియన్ల మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరేలా పని వేళలను సవరించాలని సూచించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తీసుకున్న చర్యలను ఈ నెల 8 లోపు ఎండీ కార్యాలయానికి తెలపాలని కోరారు.
సీఎం హామీతో...
సుదీర్ఘకాలం సమ్మె తర్వాత విధుల్లో చేరిన ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఒకటిన ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. రాత్రి 10 తర్వాత కూడా తాము విధులు నిర్వహించాల్సి వస్తోందని మహిళా కండక్టర్లు ముఖ్యమంత్రికి నివేదించారు. వెంటనే స్పందించిన సీఎం, వారి విధులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు