పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంతో సమ్మిళితమై ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు ఆపాదితమవుతుంది. షోడశ కళానిధిగా చంద్రుడు మఘ నక్షత్రంతో కూడి ఉండటంతో ఈ మాసాన్ని మాఘంగా వ్యవహరిస్తున్నాం. వన్నెల, వెన్నెల రేడు పదహారు కళలతో ప్రకాశించే మాఘపౌర్ణమిని ‘మహా మాఘి’గా పేర్కొంటారు. జ్యోతిషశాస్త్ర రీత్యా మఘ నక్షత్రానికి బృహస్పతి అధిపతి. బృహస్పతిని బుద్ధికారకుడిగా చెబుతారు. చంద్రుడు మనసును ప్రభావితం చేస్తాడంటారు. మనోబుద్ధుల్ని వికసింపజేస్తూ మన జీవన గమనాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపించడానికి మహా మాఘినాడు చేపట్టే విధివిధానాలు ఉపకరిస్తాయి.
మహామాఘి
మహామాఘికి శైవ, శాక్తేయ, వైష్ణవ సంప్రదాయాల్లో ప్రశస్తమైన స్థానం ఉంది. సముద్రాల్లో నదీనదాల్లో, తటాకాల్లో మహామాఘినాడు పవిత్ర స్నానాల్ని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని నమ్మకం. మహా మాఘి పర్వదినం ఆదివారంతో కలిసి వస్తే మరింత విశేషమైనదంటారు. వివిధ జలరాశుల్లో మహామాఘి పుణ్యస్నానాల్ని చేయడం ద్వారా జలాధిష్ఠాన దైవమైన భవుడి అనుగ్రహం దక్కుతుందని ‘శతరుద్ర సంహిత’ పేర్కొంది. పరమశివుడి అష్టమూర్తులతో జగత్తు ఆవరించి ఉందంటారు.
శివ సహస్రనామం
ఆ అష్టమూర్తుల్లో భవుడు జలాధిపతి. అందుకే శంకరుణ్ని జలేశ్వరుడిగా ‘శివ సహస్రనామం’ కీర్తించింది. జీవుల సకల కల్మషాల్ని శుద్ధి చేస్తూ, పంచభూతాల్లో భవుడు ప్రాణశక్తిగా వెలుగుతున్నాడు. మహేశుడి అర్ధాంగి సతీదేవి మాఘపౌర్ణమినాడే జన్మించిందంటారు. దక్షప్రజాపతి మహామాఘినాడు ఓ సరోవరంలో స్నానమాచరిస్తుండగా పద్మంలో ఓ శంఖం లభించిందంటారు. దక్షుడి కరస్పర్శతో ఆ శంఖం బాలికగా మారిందని చెబుతారు. ఆమె సతీదేవిగాసాకారమై శివుడి ఇల్లాలైంది. అందుకే మహామాఘిని ‘శంఖపౌర్ణమి’ అంటారు.
షట్తిల పౌర్ణమి
మాహామాఘినాడే జగద్గురువు ఆదిశంకరులు పంచాయతన పూజావిధిని ప్రారంభించారంటారు. మహామాఘిని షట్తిల పౌర్ణమిగా వ్యవహరిస్తారు. తిలలు కలిపిన జలంతో స్నానం, తిలాహోమం, తిలార్చనం, తిలదానం, తిల నివేదనం, తిల భక్షణం అనే ఆరు ప్రక్రియల్ని మహామాఘినాడు పాటిస్తే ఆరోగ్యవృద్ధి చేకూరుతుందని ‘వైద్యరత్నాకరం’ ప్రస్తావించింది. మహామాఘినాడు విష్ణుపూజ, అన్నదానం, హరిసంకీర్తనం తరవాత చేసే ‘మును మానసం’ అనే పవిత్రస్నానం పుణ్యయోగదాయకమని గోస్వామి తులసీదాసు వర్ణించాడు.
మహామాఘినాడు ఆచరించే పవిత్రస్నానం కేవలం బాహ్యమైనది కాదు- అది ఆంతరంగికమైనది. మన ఆలోచనల్ని, అంతరంగాల్ని నిరంతరం నిర్మలభరితం చేసుకోవడానికి పరిశుద్ధ స్నానాన్ని ఆచరించాలి. మనలో ఉండే పంచకోశాల్ని, పంచ ప్రాణాల్ని, పంచేంద్రియాల్ని పవిత్రీకృతం చేసుకోవడానికి ఈ తరహా పావనకర స్నానాలు ఉపయుక్తమవుతాయి. నిద్రాణమై ఉన్న దేహాన్ని నవచైతన్యపు వెలుగుజాడలవైపు నడిపించడానికి, అంతఃకరణాన్ని శుద్ధిపరచడానికి పుణ్యస్నానాల విధుల్ని పాటించాలి.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్