అనుకున్నట్టుగానే..పుర ఎన్నికల్లో ఓటర్లు గులాబీ పార్టీకి పట్టం కట్టారు. 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో మేజర్ స్థానాల్లో తెరాస జెండా ఎగిరిసింది. ఎన్నికలకు ముందే 77 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న గులాబీపార్టీ..పూర్తి ఫలితాల్లోనూ టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. ప్రత్యర్థులను మించిన ప్రచార వ్యూహాలతో సునాయాసంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లను గెల్చుకుంది. 120 మున్సిపాలిటీలకు 107చోట్ల గులాబీ జెండా ఎగరేసింది. కార్పొరేషన్లలోనూ జోరు కొనసాగించింది.
తొలిరౌండ్ నుంచే గులాబీ ప్రభంజనం
మూడు రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో తొలిరౌండ్ నుంచే తెరాస ఆధిపత్యం ప్రదర్శించింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి తెరాస ఓట్లశాతం పెరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో తెరాసకు 47 శాతం ఓట్లు పడితే ఈ పురపోరులో 51 శాతానికి చేరుకుంది. పుర ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని జోస్యం చెప్పిన పలు సర్వేలు నిజమయ్యాయి.
కార్పొరేషన్లలోనూ దూకుడు
కార్పొరేషన్ల ఫలితాల్లోనూ తెరాస దూకుడు కొనసాగించింది. 9 కార్పొరేషనల్లో 325 స్థానాలకు గానూ ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో ఆధిపత్యం దిశగా దూసుకెళ్తోంది. 5 కార్పొరేషన్లలో అధికార పార్టీ విజయ ఢంకా మోగించింది. బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, జవహార్‌నగర్, పీర్జాదీ గూడ కార్పొరేషన్లలో తెరాస ఆధిపత్యం ప్రదర్శించింది.
సంబురాల్లో గులాబీ దళం
పుర ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఉదయం నుంచి తెలంగాణ భవన్‌తోపాటు జిల్లాల పార్టీ కార్యాలయాల ముందు తీన్మార్ డాన్సులతో దుమ్మురేపుతున్నారు. పట్టణ ప్రాంతాల పగ్గాలు చేతికి రావడంతో అధికార పార్టీ కార్యకర్తల ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.
జీహెచ్ఎంసీ పీఠంపై గురి
వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ పీఠాన్ని కూడా పూర్తి ఆధిక్యంతో చేజిక్కించుకుంటామని గులాబీ శ్రేణులు ఢంకా మోగించి చెబుతున్నారు. ఔర్ బీస్ సాల్ తెరాస సర్కార్ అంటూ నినదిస్తున్నారు.
>>