మున్సిపల్ ఎన్నికల్లో సింహ భాగం స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి.. ఇంటి పోరు తలనొప్పిగా మారింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో తెరాస రెబల్స్ కొనసాగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని నగర, పురపాలక సంస్థల్లో తిరుగుబాటుదారులు ప్రభావితం చేస్తున్నారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, తదితర కార్పొరేషన్లలో దాదాపు ప్రతీ వార్డులోనూ కనీసం ఇద్దరు, ముగ్గురు రెబల్స్ బరిలో ఉన్నారు. చివరి నిమిషం వరకూ స్థానిక ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినా.. కొందరు పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదారు వందల మంది తెరాస తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి ఫోన్ సంభాషణ చర్చనీయాంశం:
టికెట్ దక్కని నేతలు కొందరు అక్కడక్కడ బహిరంగంగా అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్లో తన వర్గానికి టికెట్లు దక్కక పోవడం వల్ల స్థానిక నాయకుడు రాపోలు రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు టికెట్ల కోసం లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. మల్లారెడ్డి, రాపోలు రాములు మధ్య ఫోన్ సంభాషణ చర్చనీయాంశంగా మారింది. టికెట్ దక్కక పోనందునే రాపోలు రాములు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు..
కొల్లాపూర్ మున్సిపాల్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జూపల్లి కృష్ణారావు తిరుగుబాటు అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారని.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫారాలు ఇప్పించి.. సింహం గుర్తుపై పోటీకి దించారని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. జూపల్లి కృష్ణారావును కట్టడి చేయకపోతే.. పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కేటీఆర్‌కు వివరించారు. జూపల్లి కృష్ణారావు స్వయంగా ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని వీడియోలు, ఫోటోలను కేటీఆర్‌కు సమర్పించారు.
రెబల్స్‌కు పార్టీకి సంబంధం లేదు:
తెరాస బీ ఫారాలు ఉన్న వారే పార్టీ అభ్యర్థులని.. తిరుగుబాటు అభ్యర్థులకు పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు . రెబల్స్ తెరాస జెండాలు, ప్రచార సామాగ్రి వాడితే సహించేది లేదన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పలు వార్డుల్లో తెరాస రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణకు నిరాకరించారు. కొందరు మున్సిపాల్టీ కార్యాలయం వద్ద బహిరంగంగా నిరసనకు దిగారు. మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొందరు రెబల్స్‌ను ప్రోత్సహిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుబాటు అభ్యర్థుల పట్ల తెరాస నిర్ణయం తీసుకోలేక పోతోంది. రెబల్స్ వందల సంఖ్యలో ఉన్నందున.. కఠిన చర్యలకు దిగడానికి వెనకా ముందాడుతోంది.
ఇవీ చూడండి: మూడు వేల మందితో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్?