రాష్ట్రంలో ఈ ఏడాది సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.
'ఈచ్ వన్ టీచ్ వన్' విధానంతో... చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒక నిరక్షరాస్యునికి చదువు నేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా... హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో 18 ఏళ్లలోపు పైబడిన నిరక్షరాస్యుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది.
అత్యధికంగా సూర్యాపేట..
12వేల 751 గ్రామపంచాయతీల్లో 16 లక్షలకు పైగా వయోజన నిరక్షరాస్యులు ఉన్నట్లు ఇప్పటి వరకు తేలింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో లక్షా 28వేలకు పైగా చదువురాని వారు ఉండగా... అత్యల్పంగా మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో కేవలం 10వేల లోపు నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు.
మహిళలే అధికం
రాష్ట్రంలో గ్రామీణ జనాభా రెండు కోట్లకు పైబడి ఉన్నారు. నిరక్షరాస్యుల్లో అత్యధికంగా మహిళలే ఉన్నారు. పురుషులు 5 లక్షల 60వేలకు పైగా ఉండగా... మహిళల సంఖ్య 10 లక్షలా 60వేలకు పైగా ఉంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో చదువురానివారుండగా... నిర్మల్లో 93వేలకు పైగా, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 92వేలకు పైచికులు మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించారు. వికారాబాద్లో 91వేలకు పైగా ఉండగా... యాదాద్రి భువనగిరిలో 89వేలకు పైగా చదువురాని వారు ఉన్నట్లు గుర్తించారు. పల్లె ప్రగతి ఇంకా కొనసాగుతున్నందున మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు 22 నుంచి 25 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అన్నింటా ముందున్న రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకంజలో ఉండడం... మచ్చగా ఉందని అభిప్రాయపడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో అక్షరసేద్యం గావించి సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర అందిచాలని కోరారు.