హైదరాబాద్ కాచిగూడ భద్రుక కళాశాలలో భారత ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లు అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ లక్ష్యం 2024 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరడమేనని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విదేశీ, దేశీయ పెట్టుబడులు సమాంతరంగా వస్తాయన్నారు. పేదరికం నిర్మూలన, ప్రతి యువకుడికి ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా కేంద్ర సర్కారు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశానికి 35 ఏళ్ల యువత పెద్ద బలమని తెలిపారు. ఐటీ, వ్యవసాయం, పారిశ్రామిక, ఔషధ, ఇతర మౌలిక వసతుల రంగాలు ఎంతో అభివృద్ధి చెందారని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య వాతావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక పరిస్థితులు, బ్యాంకింగ్, బీమా, మానవ వనరులు, వ్యవసాయం, మార్కెటింగ్, డిజిటలైజేషన్ వంటి అంశాలపై వివిధ సెషన్లలో నిపుణులు విస్తృతంగా చర్చించారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో అపారమైన సహజ, మానవ వనరులు, సుధీర్ఘ విస్తీర్ణం గల కోస్తా తీరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిలిం సిటీ ఈసీఓ రాజీవ్ జాల్నాపుర్కర్, మహేష్ బ్యాంకు ఛైర్మన్ రమేష్ కుమార్ బంగ్, ఎస్‌జీజీబీఈఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అభిరామ కృష్ణ, కార్యదర్శులు ముకుంద్‌లాల్ భద్రుక, శ్రీకృష్ణ భద్రుక, ఆర్థిక రంగ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఘనంగా ముగిసిన ‘ఈఎస్‌ఎల్’ క్రీడా సంబరం