తహసీల్దార్ విజయారెడ్డి హత్య నుంచి రెవెన్యూ ఉద్యోగులు తేరుకోలేకపోతున్నారని రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల నుంచి అనేక మందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పట్టాలిస్తారా... చస్తారా...
తమ 'భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారా... లేక విజయారెడ్డి లాగా చస్తారా...' అని రెవెన్యూ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. కొన్ని జిల్లాలో రాజకీయనాయకులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు... రెవెన్యూ ఉద్యోగులపై ప్రజల్లో చులకన భావన తెస్తూ ఉద్యోగులు, రైతుల మధ్య వ్యతిరేక భావం కల్పిస్తున్నారని ఆక్షేపించారు.
భద్రత కల్పించండి...
భయాందోళనకు గురై అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు అభద్రతాభావానికి లోనవుతున్నారని నేతలు తెలిపారు. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడం సహా... విజయారెడ్డి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ కార్యాలయాల్లో ఎన్నో కోట్ల విలువైన రెవెన్యూ దస్త్రాలు ఉన్నందున కార్యాలయాలు, ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి సిబ్బంది కొరత తీర్చడం సహా మౌలిక సదుపాయాలు కల్పించడం, పూర్తి స్థాయి సీసీఎల్‌ఏని నియమించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరిస్తే మంచిపేరు తెస్తాం...
ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అన్ని రకాల ఆప్షన్లు తహశీల్దార్ లాగిన్‌లోనే ఉండాలని, ఫలితంగా పెండింగ్ పనులు చేయడం వల్ల ప్రజలకు సత్వర పరిష్కారం లభిస్తుందని వివరించారు. ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తేవడానికి రెవెన్యూ శాఖ కృషిచేస్తుందని నేతలు హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం