రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు అరికట్టేందుకు వివిధ శాఖల సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. "దిశా" ఉదంతం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హోం, విద్య, మహిళా-శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖా మంత్రులు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయా శాఖల కార్యదర్శులు, పోలిస్ కమిషనర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
షీటీమ్స్ మరింత బలోపేతం
మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలిస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం వివిధ శాఖల సమన్వయంతో స్వల్ప, ధీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. షీటీమ్స్‌ను మరింత బలోపేతం చేయడం, హాక్ ఐ యాప్ ను మరింత సౌకర్యవంతం చేసి రాష్ట్రమంతా విస్తరించనున్నారు.
ఆపదలో - 100కు డయల్ చెయ్యండి
పోలీస్ హెల్ప్ లైన్స్, యాప్స్ విషయంలో మహిళలు, బాలికల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. డయల్ 100, 181, 1098, 112పై క్షేత్రస్థాయి నుంచి విస్తృత ప్రచారం కల్పించాలని... అత్యవసరంలో ఫోన్ చేయాల్సిన నంబర్లను అన్ని పాఠశాలలు, కళాశాలల నోటీసు బోర్డులతో పాటు ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, క్యాబ్ లపై ఉంచాలని నిర్ణయించారు.
చిన్ననాటి నుంచే నైతికవిలువలు బోధించాలి
ప్రాథమిక స్థాయి నుంచే మహిళలు, చిన్నారులను గౌరవించేలా నైతికవిలువలను బోధించాలని.. ప్రత్యేక పాఠ్యప్రణాళిక తయారు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా షీటీమ్స్ సహకారంతో శిక్షకులను తయారు చేయనున్నారు.
ప్రవర్తన తల్లిదండ్రులు గమనించాలి
విద్యార్థుల ప్రవర్తనను గమనించడంతో పాటు వివిధ అంశాలపై తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. స్వయంసహాయక బృందాలు స్థానిక పోలిస్స్టేషన్లకు వెళ్లి మహిళలు, చిన్నారుల సమస్యలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.
ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం