రాష్ట్రంలో ఏదైనా నేరం జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు జరిగే ప్రక్రియలన్నీ ఇకమీదట ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ‘ఇంటర్ అపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)గా పిలిచే ఈ ప్రక్రియను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
దేశంలోనే తొలిసారిగా కొంతకాలం క్రితం వరంగల్ పోలీస్ యూనిట్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇది కాగితరహిత విధానమే కాకుండా వేగం, పారదర్శకతతో కూడినది. విలువైన మానవవనరుల ఆదాకు దోహదం చేసేది కావడం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడీ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తం చేశారు.
అన్నీ ఆన్‌లైన్‌లోనే..
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, జైళ్లను అంతర్జాలం ద్వారా అనుసంధానం చేశారు. దర్యాప్తునకు సంబంధించిన పురోగతి ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక ఆన్‌లైన్లోనే అభియోగపత్రం దాఖలు చేస్తారు. ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో న్యాయస్థానం నుంచి ఆన్‌లైన్లోనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం వస్తుంది. విచారణ పూర్తై తీర్పు వెలువరించాక నిందితునికి శిక్ష పడితే ఆ పత్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే జైళ్లకు పంపుతారు. జైలు నుంచి ఎవరైనా నిందితులు విడుదలైతే ఆన్‌లైన్ ద్వారా సంబంధిత పోలీసు సిబ్బందికి తెలిసిపోతుంది. తద్వారా సదరు నిందితుడిపై నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది.
సమయం.. వ్యయం ఆదా
ఒక కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి అభియోగపత్రం దాఖలు వరకు కనీసం వంద పేజీల కాగితాలు అవసరమవుతాయి. న్యాయస్థానానికి సమర్పించే ప్రతితోపాటు దాని నకలును పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, నిందితుడికి, దర్యాప్తు అధికారికి, ఇతర పర్యవేక్షణాధికారులకూ అందించాలి. అంటే ప్రతి కేసుకూ కనీసం 500 పేజీలైనా వెచ్చించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బోలెడంత సమయం పడుతోంది.
ఐసీజేఎస్ అందుబాటులోకి రావడం వల్ల క్కడా కాగితం అవసరం ఉండదు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. గతంలో మాదిరిగా పత్రాలను సమర్పించడానికి పోలీసు సిబ్బంది పదేపదే ఆయా విభాగాల మధ్య తిరగాల్సిన అవసరం ఉండదు. అన్నింటికి మించి దస్త్రాలేవీ వ్యక్తిగతంగా సమర్పించాల్సిన అవసరం లేకపోవడం వల్ల సిబ్బందికి పని తగ్గుతుంది. వారిని ఇతరత్రా విధులకు వాడుకునే అవకాశం ఉంటుంది.
ఇవీ చూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు