దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్‌పై షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ సురేందర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అనంతరం కేసు విచారణ కోసం రాచకొండ ఎస్వోటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డిని దర్యాప్తు అధికారిగా నియమించారు.
మహేశ్‌భగవత్ నేతృత్వంలో...
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్‌రెడ్డి, రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రాచకొండ ఐటీ సెల్ అధికారి శ్రీధర్‌రెడ్డి సిట్ బృందంలో ఉన్నారు. ఈ బృందం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తుంది. నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన కారణాలపై విచారణ జరపుతుంది.
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు శాఖతో పాటు ప్రభుత్వ విభాగాలు సిట్‌కు సహకరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎన్‌కౌంటర్‌పై సమగ్ర నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పిస్తుంది.
ఇవీచూడండి: 'అది బూటకపు ఎన్‌కౌంటర్.. కోర్టు తీర్పు వరకు ఆగాల్సింది'