రెక్కలొచ్చి పిల్లలు తలోదిక్కు ఎగిరిపోతే వృద్ధాప్యంలో సేదతీర్చే అమ్మ ఒడి... హైదరాబాద్ కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్. ఏళ్ల తరబడి కుటుంబానికి, సమాజానికి సేవచేసిన ఎంతోమంది అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కంటికిరెప్పలా కాపాడే సిబ్బంది.. ఆత్మీయతను పంచే వైద్యులు. ఒకేఒక్క పిలుపుతో అన్ని సౌకర్యాలు అమరగల వాతావరణం. అంతటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నచోట కూడా కరోనా వైరస్ ప్రవేశించింది.
ఫౌండేషన్‌లో 70 ఏళ్ల నుంచి 103 ఏళ్ల మధ్య వయసువారు మొత్తం 150 మంది ఉంటున్నారు. ఇందులో 29 మంది కొవిడ్ బారినపడ్డట్లు నిర్ధారణ అయింది. మనోబలం ఉంటే కరోనాను జయించేందుకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ 27 మంది కోలుకున్నారు. సర్కారు దవాఖానలైన గాంధీ ఆసుపత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్ ద్వారా లభించిన వైద్యసేవలు తమను సాధారణ స్థితికి తీసుకొచ్చాయంటూ వారు ఆనందాన్ని వెలిబుచ్చారు.
103 ఏళ్ల వయసులో ధైర్యమే ఆయుధంగా..
‘బాల్యం నుంచి క్రమశిక్షణతో కూడిన జీవితం.. మితాహారం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని నిలువగల గుండెనిబ్బరం. వయసు మీదపడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం..’ 103 ఏళ్ల వయసులోనూ పరుచూరి రామస్వామిని ఆరోగ్యంగా ఉంచాయి. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో రామస్వామికి రెండుసార్లు జరిపిన వైద్యపరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. మూడోసారి పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే రోజు స్వగ్రామంలో బాల్యమిత్రుడు చలసాని శ్రీనివాస్ మరణించారనే వార్త ఆయన్ను మరింత బాధించింది. కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. తర్వాత అంబులెన్స్‌లో టిమ్స్‌లోని క్వారంటైన్‌కు వెళ్లారు. మూడ్రోజుల అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ''ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు చక్కగా చూసుకున్నారు. సమయానికి ఆహారం, మందులు ఇస్తూ.. ధైర్యాన్ని నింపేవారు. కంటికిరెప్పలా చూసుకున్నారు'' అని తండ్రి రామస్వామితో కలిసి సీఆర్ ఫౌండేషన్‌లో ఉంటున్న ఆయన కుమార్తె జమున తెలిపారు.
వైరస్‌కు గురైతే అనాథగా వెళ్లిపోవాల్సి వస్తుందన్న భయం మినహా వీరిలో ఎటువంటి ఆందోళనా కనిపించలేదు. కరోనాను ఎదుర్కొనేందుకు ముందుగా హోమియోపతి, ఆయుర్వేద మందులు అందించాం. గొప్ప ఆలోచన, మనోనిబ్బరం వారిని శక్తిమంతులను చేశాయి. కరోనా యోధులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. త్వరలో బయటకొస్తారు.
- డాక్టర్ రజని, సీఆర్ ఫౌండేషన్ వైద్యురాలు
జీవితంలో ఎన్నో సవాళ్లను చూశాం. ఈ వయసులో ఏ ఇబ్బంది ఎదురైనా తట్టుకుని నిలబడటానికి అలవాటుపడ్డాం. కరోనా సోకిందని తెలియగానే కలిసే ఎదుర్కొందామని నిర్ణయించుకున్నాం. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య ఇబ్బందులున్నా.. ఒకరికొకరం ధైర్యం చెప్పుకొన్నాం. టిమ్స్‌లో వారం రోజులున్నాం. అక్కడి వైద్య సిబ్బంది చక్కగా చూశారు. సమయానికి మందులు, ఆహారం అందించారు. తరచూ ఆక్సిజన్ స్థాయిలు పరిశీలిస్తూ గొప్ప వైద్యం అందించారు. కంగారు పడకుండా ఉండటంతో వారం రోజుల్లోనే కోలుకున్నాం. వైరస్‌ను జయించేందుకు మనోధైర్యమే మొదటి మందు.
- కాకరాల వీరవెంకట సత్యనారాయణ(83), సూర్యకాంతం(79) దంపతులు
మొండి ధైర్యం వచ్చేసింది
అప్పటి వరకూ టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కరోనా వార్తలు చూసి భయమేసేది. నాకు కొవిడ్ పాజిటివ్ అని తెలిశాక మాత్రం ఏదో తెలియని మొండిధైర్యం వచ్చేసింది. ఏం కాదులే అని భరోసా కలిగింది. గతంలో మరుగుదొడ్డి శుభ్రం చేసేప్పుడు హార్పిక్ వాసన ఘాటుగా వచ్చేది. ఆ రోజు ఎందుకో వాసన అనిపించలేదు. ఆహారం రుచి తెలియలేదు. దీంతో డాక్టర్ రజని నాకు పరీక్ష చేయించగా.. పాజిటివ్ అని తేలింది. టిమ్స్‌లో వైద్య సేవలు చక్కగా ఉన్నాయి. మూడున్నర రోజుల తర్వాత సాధారణ స్థితికి వచ్చాను. కొద్దిరోజులకే పూర్తిగా కోలుకున్నా. ఇందుకు ధైర్యం.. వైద్యం రెండూ సహకరించాయి.
ఇదీ చదవండిః 'కొవిడ్ మరణాల రేటు తక్కువగా ఉండడానికి వైద్యుల సేవలే కారణం'