సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణ హత్యకు గురైన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి స్నేహితుడు షోయబ్ హత్య చేసినట్లు గుర్తించారు. పెళ్లికి నిరాకరించడం వల్ల బాలికను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అమ్మాయి మైనర్..
నిందితుడు షోయబ్ ఫ్లెక్సీబోర్డు డిజైనర్‌గా పనిచేస్తున్నాడని ఉత్తరమండల డీసీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. గతంలో పెళ్లి చేసుకుంటానని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడని ఆయన వివరించారు. అమ్మాయి మైనర్ కావడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు.
తలపై రాయితో మోది..
గతకొన్ని రోజులుగా బాలిక షోయబ్‌ను పట్టించుకోవడం మానేసిందని డీసీపీ తెలిపారు. గురువారం అర్ధరాత్రి షోయబ్, బాలిక ఇద్దరూ కలిసి ఇంటిపైకి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి బాలిక తలపై రాయితో కొట్టాడని కల్మేశ్వర్ వెల్లడించారు. అమ్మాయిని ఈడ్చుకుంటూ వెళ్లి పైనుంచి కింది పడేశాడని డీసీపీ చెప్పారు.
షోయబ్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. తనకు దక్కలేదనే కోపంతో బాలికను హత్య చేశాడని తెలిపారు.
ఇవీ చూడండి: 'అమీన్పూర్ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'