సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే యూనియన్లు ఉండాలా..వద్దా..అనే అంశంపై డిపోల వారీగా రహస్య ఓటింగ్ ఏర్పాటు చేసి...ఎక్కువశాతం మంది అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
సంక్షేమ కౌన్సిల్లో సభ్యులుగా చేరాలని డిపోల్లో ఒత్తిడి చేస్తున్నారని...అందులో చేరకుంటే బస్సుల్లో టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులు డిపోల్లో కట్టేందుకు వెళ్తే తీసుకోవడంలేదని అశ్వత్థామ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సంక్షేమ కౌన్సిల్లో సభ్యులను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారో వివరాలు వెల్లడించాలన్నారు.
బస్సుల సంఖ్యను కుదించడం వల్ల ఆదాయం వస్తుందేమో కానీ ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడతారని తెలిపారు.చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమ్మెకాలంలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారని..అటువంటి వారిపై ఏసీబీ అధికారులచే విచారణ జరిపించాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.
మహిళా కండక్టర్లకు ఏక పక్షంగా మార్నింగ్ షిప్ట్ వేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఏఒక్క కార్మికుడు తృప్తిగా పనిచేయడం లేదని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:'బంగారు తెలంగాణ చేస్తామంటూ బాకీల తెలంగాణగా మార్చారు'