హైదరాబాద్ మహానగరంలో 9,100 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అందులో 2,500 కిలో మీటర్ల రోడ్లు ప్రధానమైనవి. మిగిలినవి అంతర్గత, కాలనీ రహదారులు. వాటిపై జీహెచ్ఎంసీ ఇంజినీర్లు 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.400కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.700కోట్లు ఖర్చు చేశారు. నిర్వహణ రూపంలో ఆ రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మరో రూ.300కోట్లు అదనంగా వెచ్చించినట్లు సమాచారం. అంటే గత రెండేళ్లలో నగర రహదారులపై బల్దియా 1,400 కోట్లు వెచ్చించింది. ప్రజాధనాన్ని నీళ్లలా ధారపోసినప్పటికీ రహదారులు మెరుగుపడలేదు. వర్షాకాలానికి ఆరు నెలల ముందు వేసిన రోడ్డు నుంచి నెల రోజుల ముందు పూర్తయిన మార్గం వరకూ అన్నీ గుంతలమయమయ్యాయి.
తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ప్రజాధనాన్ని పలువురు అవినీతి ఇంజినీర్లు, గుత్తేదారులు దుర్వినియోగం చేశారన్న విమర్శలొస్తున్నాయి. వాళ్ల కారణంగానే ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగించే పేద, మధ్య తరగతి ప్రజలు ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలు దిక్కులేనివిగా మారుతున్నాయి. పిల్లలు అనాథలవుతున్నారు. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు దు:ఖ చట్రంలో కూరుకుపోతున్నారు.
పట్టించుకునే నాథుడే లేడు!
కొత్త రోడ్డును నిర్మించాలన్నా... మరమ్మతులు చేయాలన్నా ఇంజినీర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. అదేమీ పట్టించుకోకుండా నగరంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు జరుగుతున్నాయి. వర్షాకాలం పడ్డ గుంతలను అప్పటికప్పుడు పూడ్చుతున్నామంటూ మట్టితో నింపేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన సహాయ ఇంజినీర్లుగానీ, వర్క్ ఇన్స్పెక్టర్లుగానీ, ఇతర ఉన్నతాధికారులెవరూ క్షేత్రస్థాయిలో కనిపించరు. సొంత పనులు, గుత్తేదారులతో ములాఖత్‌లు చేసుకుంటూ జేబులు నింపేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన రహదారులను మరమ్మతులు చేసి... ప్రాణాలను కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఖండాంతరాలకు తెలంగాణ "పల్లీ".. యూరప్‌తో ఒప్పందం