ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న తమను చిన్న కారణాలతో అన్‌ఫిట్ పేరిట ఆర్టీసీ యాజమాన్యం రోడ్డున పడేసిందని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ భవన్ ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ పలు కారణాలతో అనారోగ్యానికి గురయ్యామని... చిన్న తప్పిదాలతోనే సస్పెండుకు గురైన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే సుమారు 450 మంది కార్మికులు అన్‌ఫిట్ పేరిట తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. విషయాన్ని కార్మిక , హోంశాఖ మంత్రులకు వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన కార్మికులను ఆర్టీసీలోని ఇతర విభాగాల్లో చేర్చుకోవాలని మంత్రులు ఆదేశించారని గుర్తు చేశారు. అధికారులు మాత్రం మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుల భారం భరించలేకున్నాం... ఆదుకోండి
మూడేళ్లుగా పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక అప్పుల భారం భరించలేక కూలినాలి చేసుకునే దుస్థితికి దిగాజారి పోయామని వాపోయారు. ఉద్యోగానికి వైద్యులు సమ్మతించినా... అధికారులు మాత్రం అంగీకరించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం తమకు ఉద్యోగాలు కల్పించాలని...లేని పక్షంలో తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధమని కార్మికుల కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ 'సత్యాగ్రహం'