సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 20న రానున్నారు. 18లోగా ఏర్పాట్లు పూర్తిచేసి, నిర్దేశిత విధులకు రిపోర్ట్ చేయాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు అద్వైత్ కుమార్ సింగ్, శృతి ఓజా, విజయలక్ష్మి, శానిటేషన్ జాయింట్ కమిషనర్ సుదాంష్, జోనల్ కమిషనర్ మమత, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా రాంబాబు, ఎస్‌ఇ. అనిల్ రాజ్‌లతో ఏర్పాట్ల గురించి చర్చించారు.
దోమల నివారణకు స్ప్రేయింగ్...
బొల్లారం రాష్ట్రపతి నిలయం పూర్తిగా కంటోన్మెంట్ పరిధిలో ఉన్నందున సంబంధిత అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టాలని ఎంటమాలజి అధికారిని ఆదేశించారు. యాంటి లార్వా పనులకు పెద్ద మిషన్‌తో పాటు హ్యాండ్ హోల్డింగ్ మిషన్లు కూడా వినియోగించి పరిసరాలు మొత్తాన్ని కవర్ చేయాలన్నారు. కంటోన్మెంట్ ద్వారా ఏర్పాటు చేస్తున్న 20 మొబైల్ టాయిలెట్లకు అదనంగా జీహెచ్ఎంసీ తరఫున 30 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు.
హకీంపేట ఎయిర్ పోర్టులోనూ మెుబైల్ టాయిలెట్లు...
నిరంతరం నీటి సదుపాయం కల్పించి, ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం సెప్టిక్‌ను క్లీన్ చేయించే బాధ్యతను కాంట్రాక్టర్‌కే అప్పగించాలని తెలిపారు. ఈ నెల 18 నుంచి 29 వరకు మొబైల్ టాయిలెట్ల నిర్వహణ ఉండే విధంగా అగ్రిమెంట్‌లో పొందుపర్చాలన్నారు. మొబైల్ టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించేందుకు మానిటరింగ్ చేయాలని సూచించారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో కూడా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు స్వీపింగ్, గార్బేజీ తొలగింపు పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.
పరిశుభ్రతను పెంచేందుకు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్యాకేజీ ఫుడ్‌ను అనుమతించరాదన్నారు. వెటర్నరీ విభాగం ద్వారా డాగ్ టీమ్‌లు, మంకీ క్యాచింగ్, స్టే యానిమల్స్ తొలగింపు పనులను నిర్వహించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని కోరారు. గార్డెనింగ్‌కు, మొబైల్ టాయిలెట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం