ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వారు మండిపడ్డారు. ఇవాళ ఛలో ట్యాంక్ బండ్‌కు పిలుపునివ్వటం వల్ల కార్మికులు పోలీసుల వలయాలను దాటి ట్యాంక్ బండ్ పైకి భారీగా చేరుకున్నారు. ఒక దశలో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేసినా...వాటిని చేధించుకుని ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీ శ్రేణులు ట్యాంక్ బండ్ పైకి ర్యాలీగా వెళ్లారు.
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతంలో ఓ రకమైన కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది. రోడ్లన్నీ కాసేపు నిర్మానుశ్యంగా మారి.. పూర్తిగా పోలీసుల భద్రతా పహారాలోకి వెళ్లింది. మహిళా నిరసన కారులను లేడీ కానిస్టేబుల్స్ బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. కొందరు నిరసన కారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిరసన కారుడు ట్యాంక్ బండ్‌ను వదిలివెళ్లేవరకు పోలీసుల పహారా కొనసాగింది. సాయంత్రం 6 గంటల తరువాత పోలీసులు యథావిధిగా ట్యాంక్‌బండ్ పైకి వాహనాలను అనుమతించారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం