ఆంధప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బాలాజీపేటలోని ఆదర్శనగర్‌లో... రామచిలుకలకు ఆహారం వేస్తున్న ఈమె పేరు రామలక్ష్మి. ఐదేళ్ల క్రితం ఓ జామకాయ పెట్టడం వల్ల చిలుకలతో స్నేహం మొదలైంది. ఆ స్నేహం పెరిగి మరిన్ని చిలుకల తోడు సంపాదించుకుంది. చిన్నప్పటి నుంచే ప్రకృతి ప్రేమికురాలైన రామలక్ష్మికి... పక్షులంటే ఎంతో ఇష్టం.
ఉదయాన్నే వచ్చి సందడి చేస్తున్న రామచిలుకలు
మేడమీదకి వస్తున్న రామచిలుకలకు బియ్యం, గింజలు వేయటం రామలక్ష్మికి అలవాటు. అవి రోజురోజుకీ మరిన్ని చిలుకలతో వచ్చేవి. ఇప్పుడు సుమారు 150 వరకూ నిత్యం ఇంటిపై వాలిపోతాయి. ప్రతిరోజూ తెల్లవారుజామునే మేడమీద వాలి... ఆమెను నిద్ర లేపుతాయి. రామలక్ష్మి వేసే బియ్యాన్ని ఆరగించి కొద్దిసేపు చెట్లమీద ఆడుకొని మళ్లీ ఎగిరిపోతాయి.
చిలుకలను చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
రామచిలుకల సందడితో చుట్టుపక్కల వారు కూడా ఎంతో ఆనందం పొందుతున్నారు. తెల్లవారక ముందే వాటి కిలకిలారావాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన కలుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామలక్ష్మి ఇంటి మీద వాలే పక్షులను చూసేందుకు... చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లూ వస్తున్నారు.
ఇవీ చదవండీ : అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!