‘మమ్మీ’లతో పాటు మమ్మల్నీ...
- నేను మధ్య ఆసియాలో పుట్టానని పలు పరిశోధనలు తేల్చాయి.
- నన్ను మొట్టమొదట ఇరాన్, పశ్చిమ పాకిస్థాన్‌లో పెంచినట్లు మరి కొందరు చెబుతుంటారు
- నన్ను సాగుచేయడానికి ముందే మీ పూర్వీకులు అడవి ఉల్లిని విరివిగా ఆహారంగా వాడారు.
- మొత్తానికి నన్ను 5000 సంవత్సరాల పూర్వం నుంచి పెంచుతున్నట్లు పరిశోధనలు తేల్చాయి.
- ఈజిప్టులో అయితే ‘మమ్మీ’లతో పాటు మమ్మల్నీ పిరమిడ్లలో ఖననం చేశారు. అప్పట్లోనే మమ్మల్ని చాలా విలువైన వస్తువులుగా గుర్తించేవారు.
- కొన్ని పిరమిడ్ల గోడలపైనా.. నా బొమ్మలు గీసి ఉన్నాయి.
- అమెరికాలో నా మ్యూజియం కూడా ఒకటి ఉంది.. తెలుసా?
చరకసంహితలోనూ...
- భారతదేశ ప్రాచీన వైద్య గ్రంథం చరకసంహితలోనూ నా ప్రస్తావన ఉంది. అందులో నన్ను ఔషధంగా చెప్పారు. గుండె, కళ్లు, కీళ్లకు మేలు చేస్తానని నా గురించి రాశారు.
- కేవలం మన దేశంలోనే కాదు... గ్రీసులోనూ ఔషధంగా వాడేవారు. ముఖ్యంగా ప్రాచీన ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు తమ శరీర పటుత్వం కోసం పెద్దమొత్తంలో నన్ను ఆహారంగా తీసుకునేవారు.
- రసంగా చేసుకుని తాగేవారు. శరీరాలకూ రాసుకునే వారు.
- నన్ను ఆహారంగా తీసుకుంటే.. కంటిచూపును మెరుగుపరుస్తానని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. నోటి అల్సర్లు, పుండ్ల నివారణ, పంటినొప్పికి మందుగా వాడేవారు. కుక్కకాటుకూ విరుగుడుగా ఉపయోగించేవారు.
- అందుకేనేమో.. ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత మీ దగ్గర ఎక్కువగా వాడుతుంటారు!
పోషకాల నిధి...
- నా శాస్త్రీయనామం ఆలియమ్ సీపా.
- నాలో ‘సి’ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
- పీచుపదార్థం (ఫైబర్), ఫోలిక్‌యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లూ ఉంటాయి.
- తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. కొవ్వు(ఫ్యాట్) అసలే ఉండదు.
- నాలో సల్ఫర్ (గంధకం) కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నన్ను కోసేటప్పుడు మీకు కన్నీళ్లు వస్తాయి.
బ్యాక్టీరియాను ఆకర్షిస్తాను...
- నేను చూడటానికి మాములుగానే కనిపిస్తాను. పొరలు పొరలుగా ఉంటాను. సాధారణంగా 30 రోజులకు మించి నిల్వ ఉండను.
- కానీ నా గురించి మీకో విషయం తెలుసా?! నాలో ఉండే కొన్ని రసాయనాలు బ్యాక్టీరియాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. తర్వాత అవి నా ఘాటుకు చనిపోతాయి. బ్యాక్టీరియా పరిమితికి మించి పెరిగితే మాత్రం నా ఆటకట్టుతుంది.
- అందుకే అప్పుడు నల్లగా మారి పాడైపోతాను.
- నా పొట్టును మీరు ఎందుకూ పనికిరాదు అని పడేస్తుంటారు కానీ.. దాన్ని కొన్ని దేశాల్లో సహజ సిద్ధమైన రంగుల తయారీకి వాడుతుంటారు. వీటిని వస్త్ర పరిశ్రమలో అద్దకం కోసం ఉపయోగిస్తుంటారు.
- నా పొట్టును మీరు ఎందుకూ పనికిరాదు అని పడేస్తుంటారు కానీ.. దాన్ని కొన్ని దేశాల్లో సహజ సిద్ధమైన రంగుల తయారీకి వాడుతుంటారు. వీటిని వస్త్ర పరిశ్రమలో అద్దకం కోసం ఉపయోగిస్తుంటారు.
- నన్ను పెంచడానికి విత్తనాలుగా ఉల్లిపాయలు, గింజలనూ వాడవచ్చు.
మీ ఇంట్లోనూ పెంచుకోవచ్చు!
- ‘ఉల్లి ధరలు పెరిగాయ్.. పెరిగాయ్..’ ఎక్కడ చూసినా.. ఇదే వినిపిస్తోంది కదా! మీ ఇంటి పెరట్లో... లేదా చిన్న కుండీలోనైనా నన్ను ఎంచక్కా పెంచేయొచ్చు.
- అన్ని రకాల నేలల్లోనూ నేను పెరుగుతాను.
- మరీ ఎక్కువ కాకుండా.. కొద్దికొద్దిగా నీరు అందిస్తే చాలు నేను ఎంచక్కా పెరిగేస్తా.
- ఓ సారి నన్ను పెంచేందుకు మీరూ ప్రయత్నించి చూడండి.
సరే ఉంటా మరి..!